జోగీందర్ శర్మ మీకు గుర్తున్నాడా? అరే ఈ పేరు ఎక్కడో విన్నట్లు ఉందే.. కానీ గుర్తురావడం లేదు అబ్బా! ఎవరబ్బా! అని ఆలోచిస్తున్నారా. ఒక్కసారి 13 ఏళ్ల వెనక్కు వెళదాం పదండి.
అది 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్.. హోరాహోరీగా సాగుతున్న భారత్-పాక్ మ్యాచ్. నరాలు తెగే ఉత్కంఠ. మరో ఓవర్ మాత్రమే మిగిలుంది. ఇలాంటి సమయంలో అనామక బౌలర్ జోగీందర్ శర్మకు బంతినిచ్చాడు కెప్టెన్ ధోనీ. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ అద్భుతంగా ఆ ఓవర్ వేసి టీమ్ఇండియా తొలిసారి ఆ కప్ గెలుచుకోవడంలో జోగీందర్ కీలకంగా నిలిచాడు.
కానీ ఆ తర్వాత జాతీయ జట్టులో జోగీందర్ చోటే దక్కించుకోలేకపోయాడు. అయితే ఇతడిలానే చాలామంది యువ క్రికెటర్లు అదిరిపోయే గణాంకాలతో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత కనుమరుగైపోయారు. అలాంటి ఓ ఐదుగురు క్రికెటర్ల గురించే ఈ కథనం.
1.జోగీందర్ శర్మ-టీమ్ఇండియా
2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్ విజయంతో హీరోగా అవతరించిన జోగీందర్ శర్మ.. ఆ తర్వాత జట్టులో స్థానం నిలుపుకోలేకపోయాడు. 2008లో ఐపీఎల్ ప్రారంభ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలో దిగిన పెద్దగా మెప్పించలేకపోయాడు. మొత్తంగా భారత్ తరఫున నాలుగు వన్డేలు, నాలుగు టీ20లు మాత్రమే ఆడాడు.
2017 వరకు హరియాణా తరఫున దేశవాళీ క్రికెట్ ఆడిన జోగీందర్.. ప్రస్తుతం ఆ రాష్ట్ర పోలీస్ శాఖలో డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నాడు.
2.హసీబ్ హమీద్-ఇంగ్లాండ్
2016లో భారత్ పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టులో 19 ఏళ్ల హమీద్ ఉన్నాడు. తొలి రెండు టెస్టుల్లో మన స్విన్ ద్వయం అశ్విన్-జడేజాను సమర్ధవంతంగా ఎదుర్కొన్ని ఆకట్టుకున్నాడు. కానీ మూడో టెస్టుకు ముందు గాయపడి, మొత్తం పర్యటనకే దూరమయ్యాడు.
ఆ తర్వాత కోలుకున్నా సరే పూర్తిగా కనుమరుగైపోయాడు. మొత్తంగా ఆరు ఇన్నింగ్స్‌లో 43.80 సగటుతో 219 పరుగులు చేసినప్పటికీ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వలేకపోయాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ దేశవాళీ జట్టు నాటింగ్హమ్ తరఫున ఆడుతున్నాడు.
3.జయంత్ యాదవ్-టీమ్ఇండియా
ఆరంభంలో ఆకట్టుకున్నా ఆ తర్వాత అవకాశం దక్కించులేకపోయిన భారత మరో స్పిన్ ఆల్‌రౌండర్ జయంత్ యాదవ్. 2016 చివర్లో జరిగిన ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికైన ఈ ఆటగాడు.. తొలి రెండు టెస్టుల్లో తలో నాలుగు వికెట్లు తీయడం సహా 35, 27 నాటౌట్, 55, 104 పరుగులు చేసి మెప్పించాడు. కానీ జట్టులోని సహచర ఆటగాళ్లతో పోటీ కారణంగా రీఎంట్రీ ఇవ్వలేకపోయాడు. ప్రస్తుతం హరియాణా తరఫున దేశవాళీల్లో ఆడుతున్నాడు.
4.స్టీవ్ ఓకీఫ్-ఆస్ట్రేలియా
2017 భారత్ పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టులో స్టీవ్ ఓకీఫ్ సభ్యుడు. తన స్పిన్ మాయాజాలంతో ఆతిథ్య బ్యాట్స్‌మెన్‌ను ముప్పతిప్పలు పెట్టాడు. పుణె టెస్టులోని రెండు ఇన్నింగ్స్‌ల్లో తలో 6 వికెట్లు తీసి, అందరితో శెభాష్ అనిపించుకున్నాడు. కానీ ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో మాత్రం ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. అనంతరం ఆసీస్ టెస్టు బృందంలో చోటే దక్కించుకోలేకపోయాడు.
కంగారూ జట్టు తరఫున 9 టెస్టులు, 7 టీ20లు ఆడిన 36 ఏళ్ల ఓకీఫ్.. తిరిగి జాతీయ జట్టులోకి రావడం దాదాపు అసాధ్యం.
5. ఫిల్ జాక్వెస్-ఆస్ట్రేలియా
జస్టిన్ లాంగర్ రిటైర్మెంట్ తర్వాత ఓపెనర్ కోసం చూస్తున్న ఆస్ట్రేలియా.. ఫిల్ జాక్వెస్కు తిరిగి అవకాశమిచ్చింది. రీఎంట్రీలో ఆడిన వరుస టెస్టుల్లో సెంచరీలు చేసి ఫిల్ ఆకట్టుకున్నాడు. 2008 వెస్టిండీస్ పర్యటనలో అద్భుత బ్యాటింగ్‌తో మెప్పించాడు. కానీ అదే సిరీస్‌లో గాయమై జట్టులో చోటు కోల్పోయాడు. ఆ తర్వాత తిరిగి స్థానం సంపాదించలేకపోయాడు.
మొత్తంగా 11 టెస్టులో 47.5 సగటులో 902 పరుగులు చేశాడు. ఇందులో మూడు శతకాలు, 6 అర్ధశతకాలు ఉండటం విశేషం. 2014లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఇతడు.. ప్రస్తుతం ఆసీస్ దేశవాళీ జట్టుకు కోచ్‌గా కొనసాగుతున్నాడు.
ఇవీ చదవండి: