కోహ్లీసేనకు శుభవార్త! బీసీసీఐ మంత్రాంగం ఫలించింది. టీమ్‌ఇండియాకు కఠిన క్వారంటైన్ నుంచి బ్రిటిష్ ప్రభుత్వం సడలింపులు కల్పించింది. ప్రయాణ ఆంక్షలను రద్దు చేసింది.
ప్రస్తుతం దేశంలో కొవిడ్-19 విజృంభణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై బ్రిటన్ ఆంక్షలు విధించింది. సొంత దేశం, ఐర్లాండ్ పౌరులు మినహా మరెవ్వరినీ రానివ్వడం లేదు. ఇంగ్లాండ్ పర్యటన కోసం టీమ్ఇండియా మూడు నెలలు అక్కడే ఉండాలి. మహిళల జట్టు కూడా ఒక టెస్టు, పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీసుల కోసం వెళ్తోంది. బీసీసీఐ అక్కడి ప్రభుత్వంతో చర్చించి సడలింపులు సాధించింది.
టీమ్‌ఇండియా జూన్ 2న బ్రిటన్‌కు బయల్దేరనుంది. మూడో తేదీ నుంచి భారత బృందం సౌథాంప్టన్‌లో కఠిన క్వారంటైన్‌లో ఉండనుంది. జూన్18న న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ ఆడనుంది. ఆ తర్వాత నెలరోజులు సాధన మ్యాచులు ఆడి ఇంగ్లాండ్‌తో సుదీర్ఘ ఫార్మాట్లో తలపడుతుంది.
బుధవారం లోపు టీమ్‌ఇండియా సభ్యులంతా ముంబయికి చేరుకోనున్నారు. మే 24న బయో బుడగలోకి ప్రవేశిస్తారు. ముంబయిలో ఉండే క్రికెటర్లు 24న నేరుగా బుడగలోకి ప్రవేశించొచ్చు. మిగతా నగరాల నుంచి వచ్చే వారి కోసం బీసీసీఐ ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్, దిల్లీ, చెన్నై నుంచి ఛార్టర్ విమానాలు పెట్టింది. బెంగళూరులోని క్రికెటర్లు చెన్నై నుంచి రావాలి. కోల్‌కతా ఆటగాళ్లు వాణిజ్య విమానాల్లో ముంబయికి చేరుకోవాలి. గుజరాత్ క్రికటర్లకూ ఇంతే.
సుదీర్ఘ పర్యటన, కఠినమైన బయో బుడగ కాబట్టి కుటుంబ సభ్యులకూ అవకాశం ఇస్తున్నారు. క్రికెటర్లతో పాటు వారూ ముంబయిలో బుడగలో ఉండాలి. క్రికెటర్లు, సిబ్బందికి కఠిన ఆంక్షల నుంచి కొన్ని మినహాయింపులు ఇవ్వగా కుటుంబ సభ్యుల కోసమూ బీసీసీఐ ప్రయత్నిస్తోంది. ఎవరైనా సరే ముంబయిలో పాజిటివ్ వస్తే మాత్రం ఇంగ్లాండ్‌కు ప్రయాణం లేనట్టే!