Axar Patel on Dhoni: 2014, డిసెంబర్ 30.. టెస్టు క్రికెట్‌కు మాజీ కెప్టెన్ ధోని అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించిన రోజు. ఆస్ట్రేలియా పర్యటనలో మూడో టెస్టు తర్వాత మహి ఈ ప్రకటన చేశాడు. అయితే జట్టు సభ్యులకు మాత్రం అంతకంటే ముందే ఆ మ్యాచ్ రెండో రోజు ఆట ముగిశాక ఈ విషయం తెలిసిందని స్పిన్నర్ అక్షర్ పటేల్ వెల్లడించాడు. ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత జట్టుకు తొలిసారి ఎంపికైన అతను తాజాగా ఓ షోలో మాట్లాడుతూ ఆ రోజు ఏం జరిగిందో బయటపెట్టాడు.
" మెల్‌బోర్న్‌లో బాక్సింగ్ డే టెస్టు రెండో రోజు ఆట ముగిశాక ధోని రిటైర్మెంట్ గురించి తెలిసింది. ఒక్కసారిగా జట్టు వాతావరణం మారిపోయింది. అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. అప్పుడు రవిశాస్త్రి అందరితో సమావేశం ఏర్పాటు చేశాడు. 'అందరికీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. మహి రిటైరవుతున్నాడు' అని అతను చెప్పాడు. వెంటనే రైనా ఏడవడం మొదలెట్టాడు. నా చుట్టూ ఉన్నవాళ్లందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అసలు ఏం జరుగుతుందో నాకర్థం కాలేదు. నేను వేరే ప్రపంచంలో ఉన్నట్లు అనిపించింది. నాకేం మాట్లాడాలో తెలీలేదు. మహి భాయ్‌ను కలవడం నాకదే తొలిసారి. నాకంటే ముందే అతను నాతో మాట కలిపాడు. 'బాపు (అక్షర్ ముద్దుపేరు).. నువ్వు వచ్చి నన్ను వెళ్లేలా చేశావా?' అని సరదాగా అన్నాడు. ఆ తర్వాత హత్తుకున్నాడు. నాకు కూడా కన్నీళ్లు ఆగలేదు. నేను అప్పుడే జట్టుకు తొలిసారి ఎంపికయ్యా. కానీ ధోని వీడ్కోలు పలికాడు"
- అక్షర్ పటేల్, స్పిన్నర్
ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టుల్లో అక్షర్ పటేల్‌కు ఆడే అవకాశం దక్కలేదు. గతేడాది ఇంగ్లాండ్‌తో జరిగిన సుదీర్ఘ ఫార్మాట్లో అరంగేట్రం చేశాడు. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థులను కట్టడి చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. టీమిండియాలో కీలక ఆటగాడిగా మారిపోయాడు అక్షర్. ఇటు ఐపీఎల్ మెగా ఈవెంట్లోనూ తనదైన బౌలింగ్‌తో ఆకట్టుకునే ప్రదర్శన చేస్తున్నాడు.
ఇదీ చూడండి: ఈ స్టార్ క్రికెటర్లు వాళ్ల భార్యల కన్నా చిన్నోళ్లు