AUS vs ENG Ashes: యాషెస్ సిరీస్‌లో భాగంగా గబ్బా వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా 196 పరుగుల అధిక్యంలో ఉంది. రెండో రోజు ఆటముగిసే సమయానికి 343/7 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ (112), మిచెల్ స్టార్క్ (10) క్రీజులో ఉన్నారు.
తొలిరోజు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ ఘోరంగా విఫలమైంది. 147 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 5 వికెట్లు పడగొట్టాడు.
ఇది చాలా దారుణం..
Ricky Ponting News: ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్ యాషెస్ సిరీస్ మ్యాచ్‌ల పర్యవేక్షకులపై మండిపడ్డాడు. గబ్బా వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో గురువారం బెన్‌స్టోక్స్ బౌలింగ్ చేశాడు. అతడు బంతి అందుకున్న తొలి ఓవర్‌లోనే నాలుగో బంతికి డేవిడ్ వార్నర్‌ను (17) పరుగుల వద్ద బౌల్డ్ చేశాడు. అయితే, ఆ బంతి రీప్లేలో నోబాల్‌గా తేలడం వల్ల ఆసీస్ ఓపెనర్ బతికిపోయాడు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే అంతకుముందు స్టోక్స్ వేసిన తొలి మూడు బంతులు కూడా నోబాల్స్‌గా నమోదైనవే. ఈ విషయాన్ని థర్డ్ అంపైర్‌గా ఉన్న పాల్ విల్సన్ సైతం గుర్తించలేదు. ఇదే క్రమంలో బెన్‌స్టోక్స్ తొలి సెషన్ మొత్తంలో ఐదు ఓవర్లు బౌలింగ్ చేయగా 14 బంతులు నోబాల్స్‌గానే వేశాడు. ఇది తర్వాత నిర్ధారణ కావడంపై పాంటింగ్ స్పందించాడు.
"మ్యాచ్ అధికారులు ఎవరైనా ఇలాంటి విషయాలను పరిశీలిస్తూ ఉంటే.. ముందే ఆ బంతుల్ని నోబాల్స్‌గా పరిగణించకపోవడం అనేది దారుణమైన విధి నిర్వహణ అని నేను భావిస్తాను. ఒకవేళ తొలి బంతి వేసినప్పుడే అధికారులు దాన్ని నోబాల్‌గా ప్రకటించి ఉంటే స్టోక్స్ తన బౌలింగ్‌లో మార్పులు చేసుకొని తన కాలు క్రీజు బయటపడకుండా జాగ్రత్త పడేవాడు. అయితే, అక్కడ ఏం జరిగిందనేది నాకు తెలియదు. ఈ విషయంపై స్పష్టతకోసం ఎదురుచూస్తున్నా"
--రికీ పాంటింగ్, ఆస్ట్రేలియా మాజీ సారథి.
ఈ విషయంపై స్పందించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. థర్డ్ అంపైర్ చూసుకునే ఈ నోబాల్స్ వ్యవహారాలను గుర్తించే టెక్నాలజీ ఈ మ్యాచ్‌లో లేదని, అందువల్లే వాటిని గుర్తించలేదని స్పష్టం చేసింది. అయితే, ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విశేషం.. ఇతర బంతుల్ని కాకుండా కేవలం వికెట్ పడిన బంతులకు మాత్రం రీప్లే చూసి నిర్ధారించే అవకాశం ఉంది. అందువల్లే వార్నర్ బతికిపోయాడు. చివరికి అతడు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసి 94 పరుగుల వద్ద ఔటయ్యాడు.
ఇదీ చదవండి: