మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS DHONI)పై ప్రశంసల వర్షం కురిపించాడు టీమ్ఇండియా ఆటగాడు కేఎల్ రాహుల్(KL RAHUL). మహీ కోసం తుపాకీ గుండుకు ఎదురెళ్లాడానికైనా టీమ్ సభ్యులు సిద్ధమని పేర్కొన్నాడు. అందుకోసం రెండో ఆలోచనే చేయమని వెల్లడించాడు. జట్టు సభ్యులు అతడికెంతో గౌరవం ఇస్తారని వెల్లడించాడు. ఆటగాళ్ల సామర్థ్యం మెరుగుపర్చడంలో విరాట్ కోహ్లీకి తిరుగులేదని తెలిపాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న రాహుల్ మీడియాతో మాట్లాడాడు.
"ఎవరైనా కెప్టెన్ గురించి అడిగారంటే మా తరానికి వెంటనే గుర్తొచ్చేది ఎంఎస్ ధోనీ. మేమందరం అతడి సారథ్యంలోనే ఆడాం. అవును, అతడెన్నో టోర్నీలు గెలిచాడు. దేశం కోసం ఐసీసీ ట్రోఫీలు అందించాడు. నా దృష్టిలో మాత్రం ఒక నాయకుడిగా జట్టు సభ్యుల గౌరవం దక్కించుకోవడమే అతిపెద్ద ఘనత. మీకో విషయం చెబుతా. అతడి కోసం తుపాకీ గుండుకు ఎదురెళ్లమంటే మరో ఆలోచన లేకుండా వెళ్తాం. మహీ నుంచి నేను ఎన్నో నేర్చుకున్నా. ఒడుదొడుకులు ఎదురైనా ఒదిగి ఉండటాన్ని అతడి నుంచే తెలుసుకున్నా. దేశం కోసం అతడు జట్టును నడిపించిన తీరు అద్భుతం"
-కేఎల్ రాహుల్, టీమ్ఇండియా క్రికెటర్.
ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీ(VIRAT KOHLI) అంకితభావం, అభిరుచికి తిరుగులేదని రాహుల్ అన్నాడు. "నేనిప్పుడు విరాట్ సారథ్యంలో ఆడుతున్నా. అతడో భిన్నమైన కెప్టెన్. వ్యక్తిగతంగా ఎంతో అంకితభావంతో ఉంటాడు. అందరూ వంద శాతం కష్టపడితే అతడు 200 శాతం శ్రమిస్తాడు. అలాగే.. జట్టు సభ్యులంతా 100 నుంచి 200 శాతం కష్టపడేలా చేసే నమ్మశక్యం కాని సామర్థ్యం అతడి సొంతం" అని వెల్లడించాడు.
ఇదీ చదవండి: మైదానంలో కుప్పకూలిన ఇద్దరు విండీస్ క్రికెటర్లు