Ajaz Patel: ఒక ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు తీసి చరిత్ర సృష్టించిన ఆటగాడిని సాధారణంగా ఏ జట్టయినా ఎలా చూసుకుంటుంది..? అతడి స్థానానికైతే కొన్నాళ్లు ఢోకా ఉండదు. కానీ న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నం! ఆ ఫీట్ సాధించిన తర్వాత టెస్టులోనే అతడికి చోటు దక్కలేదు. ఇటీవల భారత్‌తో ముంబయిలో జరిగిన రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లతో ఔరా అనిపించిన అజాజ్.. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జనవరి 1న ఆరంభమయ్యే రెండు టెస్టుల సిరీస్‌కు కివీస్ జట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు. ఈ జట్టులో ఏకైక స్పిన్నర్‌గా రచిన్ రవీంద్ర ఒక్కడే ఉన్నాడు.
స్వదేశంలో పరిస్థితులకు తగ్గట్టుగా జట్టును ఎంపిక చేశామని కోచ్ గ్యారీ స్టెడ్ చెప్పాడు. "భారత్‌పై ఒక ఇన్నింగ్స్‌తో పది వికెట్లు తీసిన అజాజ్ గురించి అందరూ ఆలోచిస్తూ ఉండొచ్చు. కానీ పరిస్థితులకు తగ్గట్టుగా జట్టు ఎంపికకే మేమెప్పుడూ మొగ్గు చూపుతాం. రచిన్‌తో పాటు ఆల్‌రౌండర్ డారెల్ మిచెల్‌ను తీసుకోవడం ద్వారా జట్టు సమతూకంగా ఉంటుందని భావించాం" అని స్టెడ్ పేర్కొన్నాడు. గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ లేకపోవడం వల్ల ఈ సిరీస్‌లో న్యూజిలాండ్‌ను టామ్ లేథమ్ నడిపించనున్నాడు.
ఇదీ చూడండి : మహీ ఎప్పుడూ అదే మాట చెప్పేవాడు: అశ్విన్