టీమ్ఇండియా మాజీ సారథి, వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ(Dhoni) నుంచి యువ క్రికెటర్ సంజూ శాంసన్(Sanju Samson) నేర్చుకోవాలని మాజీ బ్యాట్స్‌మన్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా(Aakash Chopra) సూచించాడు. ఇటీవలే తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన ఆకాశ్.. సంజూ బ్యాటింగ్‌పై స్పందించాడు. శ్రీలంక పర్యటనలో వన్డే క్రికెట్‌లో ఈ యువ బ్యాట్స్‌మన్ తన ఆటలో ఏమైనా మార్పులు చేసుకుంటాడా?లేక సహజసిద్ధమైన ఆటే ఆడతాడా? అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చాడు.
"సంజూ ధోనీ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. లంక పర్యటనలో అతడికి టీ20ల్లో లేదా వన్డేల్లో తుది జట్టులో ఆడే అవకాశం వస్తుందో లేదో తెలియదు. కానీ.. సంజూ మాత్రం ఇదివరకే తన సహజసిద్ధమైన ఆట ఆడతానని చెప్పాడు. అయితే, ఇక్కడ జాగ్రత్తగా ఆడటం, అజాగ్రత్తగా ఆడటం అనేవి ఉంటాయి. అందులో జాగ్రత్తగా ఆడటమంటే ధోనీలా ఆడాలని, అజాగ్రత్తగా అంటే ఇంతకుముందు కొంతమంది ఆటగాళ్లు ఆడటం చూశాం. ఒకవేళ సంజూకు వన్డేల్లో అవకాశం వస్తే పరిస్థితులకు తగ్గట్టు ఆడాలి. పిచ్ ఎలా ఉంది, స్కోరుబోర్డు ఎలా సాగుతుందనే విషయాలని గమనించి అందుకు తగ్గట్టు బ్యాటింగ్ చేయాలి. అన్ని వేళలా ఒకే పద్ధతిలో ఆడకూడదని, పరిస్థితులకు తగ్గట్టు తనని తాను మలుచుకోవాలి. అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా ఎదిగి జట్టులో స్థానం కాపాడుకోవాలంటే పరిస్థితులకు తగ్గట్టే ఆడాలి".
- ఆకాశ్ చోప్రా, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
శ్రీలంక పర్యటన(IND vs SL)లో భాగంగా ఆతిథ్య జట్టుతో టీమ్ఇండియా మూడు వన్డేలు(జులై 13,16,18 తేదీల్లో), మూడు టీ20లు(21,23,25 తేదీల్లో) ఆడనున్నాయి. సీనియర్ ఆటగాళ్లు కోహ్లీ, రోహిత్, బుమ్రాలతో కూడిన జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో యువ జట్టుతో లంకకు పయనమవనుంది టీమ్ఇండియా.
ఇదీ చూడండి.. IND VS SL: టీమ్ఇండియా కఠిన క్వారంటైన్లో