2022 బర్మింగ్‌హామ్ వేదికగా కామన్వెల్త్ గేమ్స్‌లో ఈసారి మహిళల క్రికెట్‌కు స్థానం కల్పించారు. అందుకు సంబంధించి టీ20 మ్యాచ్‌లను నిర్వహించనున్న తేదీలను ప్రకటించారు. ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో జులై 29 నుంచి ఆగస్టు 7 వరకు మ్యాచ్‌లను నిర్వహించనున్నారు.
ఆగస్టు 4 వరకు గ్రూప్ దశ మ్యాచ్‌లను నిర్వహిస్తారు. ఆగస్టు 6న సెమీస్‌ను జరుపుతారు. కాంస్య పతకానికి సంబంధించిన మ్యాచ్‌ను ఆగస్టు 7న నిర్వహిస్తారు. అదే రోజు ఫైనల్‌ను కూడా జరుపనున్నారు.
2022 కామన్వెల్త్ గేమ్స్‌కు సంబంధించి షెడ్యూల్‌ను కామన్వెల్త్ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారు. స్విమ్మింగ్, డైవింగ్‌కు 11 రోజులు, క్రికెట్‌కు 8 రోజులు, జిమ్నాస్టిక్స్‌కు 8 రోజులు, అథ్లెటిక్స్‌తో పాటు మారథాన్‌కు 7 రోజుల చొప్పున కేటాయింపులు చేశారు.
1998 కౌలాలంపూర్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ తర్వాత ఈ పోటీల్లో క్రికెట్ భాగం కావడం ఇదే తొలిసారి. గతంలో 50 ఓవర్ల ఫార్మాట్లో పురుషుల క్రికెట్ జట్లు ఈ ఆటల్లో పాల్గొన్నాయి. ఏప్రిల్ 1 నాటికి ఐసీసీ ర్యాంకింగ్స్‌ల్లో తొలి ఆరు స్థానాల్లో ఉన్న మహిళా జట్లు ఈ గేమ్స్‌లో పోటీపడతాయి. వీటితో పాటు ఆతిథ్యం ఇచ్చిన కారణంగా ఇంగ్లాండ్ నేరుగా పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కనుంది. కాగా, ఇప్పటివరకు టీమ్ఇండియా మూడో స్థానంలో ఉంది.
ఇదీ చదవండి: కామన్వెల్త్ క్రీడల్లోకి మళ్లీ క్రికెట్!