కరోనా నేపథ్యంలో క్రీడాటోర్నీలన్నీ రద్దయ్యాయి. ఒలింపిక్స్ కూడా వాయిదా పడుతుందంటూ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఈ మెగాటోర్నీని వాయిదా వేస్తేనే మంచిదని అభిప్రాయపడుతున్నాడు బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్.
"కరోనా వైరస్ కారణంగా టోక్యో ఒలింపిక్స్ జరుగుతాయా లేదో అనుమానంగానే ఉంది. ఈ మెగా ఈవెంట్ ఎంతో దూరంలో లేదు. ఇప్పటికే సన్నాహకాలు ప్రారంభం కావాల్సి ఉంది. ఈ విషయంలో అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ఒక నిర్ణయం తీసుకుంటే అందరికి స్పష్టత వస్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలపై నిబంధనలు ఉన్నాయి. ప్రతి దేశం తమ పౌరుల ఆరోగ్యమే ప్రధానంగా భావిస్తోంది. ఇలాంటి క్లిష్ట స్థితిలో ఒలింపిక్స్‌ను వాయిదా వేయడమే సరైందిగా కనిపిస్తోంది."
"క్రీడాకారుల భద్రతను పణంగా పెట్టి ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ఆల్ ఇంగ్లాండ్ టోర్నీని నిర్వహించడం తప్పుడు నిర్ణయమే. ఈ స్థితిలో ఏ నిర్ణయం తీసుకున్నా అందులో లాభంతో పాటు నష్టమూ ఉంటుంది. కానీ ఎక్కువ మందికి న్యాయం జరిగేటప్పుడు కఠినంగా ఉండక తప్పదు. బీడబ్ల్యూఎఫ్ కూడా ఇదే స్థితిలో ఉంది. ఒలింపిక్ అర్హత టోర్నీలను వాయిదా వేస్తే.. అక్రిడేషన్లు, వీసాలు లాంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి పరిస్థితిని ముందెన్నడు ఎదుర్కోలేదు. కాబట్టి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పాటించక తప్పదు. ఏప్రిల్ వరకు టోర్నీలు లేవు. అందరూ విశ్రాంతి తీసుకుంటేనే నయం. ఇంటి దగ్గరే ఉండి ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాలి."
భారత జట్టుతో పాటు ఆల్ ఇంగ్లాండ్ టోర్నీకి వెళ్లొచ్చిన గోపీ కూడా అందరికి దూరంగా ఉంటూ స్వీయ నియంత్రణ పాటిస్తున్నాడు. షట్లర్లందరి నుంచి వ్యతిరేకత ఎదురు కావడం వల్ల బీడబ్ల్యూఎఫ్ ఏప్రిల్ 12 వరకు అన్ని టోర్నీలను వాయిదా వేసింది.