భారత ప్రముఖ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్.. నేటి నుంచి కౌలాలంపూర్ వేదికగా జరిగే మలేసియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నీకి సిద్ధమవుతున్నారు. కొత్త ఏడాది తొలి టైటిల్ కొట్టాలనే పట్టుదలతో బరిలోకి దిగుతున్నారు. వీరి ప్రదర్శనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
గతేడాది ప్రపంచ ఛాంపియన్షిప్స్ గెలిచింది సింధు. ఆ తర్వాత జరిగిన టోర్నీల్లో అంతగా రాణించలేకపోయింది. ఇలాంటి పరిస్థితే సైనాకు ఎదురైంది. గత సంవత్సరం ఇండోనేసియా మాస్టర్స్ గెలుచుకున్న తర్వాత.. మరో టైటిల్ దక్కించుకోలేకపోయింది.
ఆరో సీడ్ సింధు.. తొలి రౌండ్లో ఎవజేనియా(రష్యా)తో తలపడనుంది. ఇందులో సింధు గెలిస్తే.. క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రపంచ నం.1 తైజుంగ్తో తలపడొచ్చు. సైనా.. క్వాలిఫయర్‌లో అక్సియటా అరీనాతో మ్యాచ్ ఆడనుంది.
పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్.. రెండో సీడ్ చౌ టైన్ చెన్ను తొలి రౌండ్లో ఎదుర్కోనున్నాడు. సాయిప్రణీత్.. రాస్మస్ జెమ్క్(డెన్మార్క్)ను ఢీకొట్టనున్నాడు.
మిగతా వారిలో పారుపల్లి కశ్యప్, సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ, అశ్విని పొన్నప్పు-సిక్కిరెడ్డి జోడీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.