ప్రపంచ టూర్ ఫైనల్స్‌లో విజేతగా నిలిచి వరల్డ్ నంబర్‌వన్, జపాన్ షట్లర్ కెంటో మొమోటా అరుదైన రికార్డు సాధించాడు. ఒకే ఏడాది 11 టైటిల్స్ గెలిచిన తొలి షట్లర్‌గా రికార్డు సృష్టించాడు. ఆదివారం జరిగిన సింగిల్స్ తుదిపోరులో ఇండోనేషియా ప్లేయర్ ఆంథోనీని ఓడించి ఈ ఘనత సాధించాడు.
87 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఫైనల్లో 17-21, 21-17, 21-14 తేడాతో ప్రత్యర్థిని ఓడించాడు. తొలి గేమ్‌లో ఓడినా తర్వాత పుంజుకొని ప్రత్యర్థిపై పైచేయి సాధించాడు. రెండు సెట్లలోనూ ఆధిపత్యం చెలాయించి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.
గతంలో ఒకే ఏడాది అత్యధిక టైటిల్స్ గెలిచిన రికార్డు లీచోంగ్ వి (మలేసియా), వాంగ్ జియోలి-యు యాంగ్ (చైనా) జంట పేరిట ఉండేది. 2010లో లీచోంగ్ సింగిల్స్ విభాగంలో 10 టైటిల్స్ గెలవగా, 2011లో వాంగ్ జియోలి- యు యాంగ్ జోడీ మహిళల డబుల్స్ విభాగంలో 10 టైటిల్స్ సాధించింది.
ఈ ఏడాది కెంటో చైనా మాస్టర్స్, డెన్మార్క్ ఓపెన్, కొరియా ఓపెన్, చైనా ఓపెన్, ప్రపంచ ఛాంపియన్షిప్, జపాన్ ఓపెన్, ఆసియా ఛాంపియన్షిప్, సింగపూర్ ఓపెన్, ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్, జర్మన్ ఓపెన్లలో విజేతగా నిలిచాడు.
ఇదీ చదవండి: గాయపడిన విద్యార్థులను పట్టించుకోండి: ఇర్ఫాన్