కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా ఎన్నో వ్యయ, ప్రయాసలకోర్చి 'ది ఫ్యామిలీ మ్యాన్: సీజన్2' రూపొందించామని ఆ సిరీస్ సృష్టికర్తలు రాజ్ నిడుమోరు, కృష్ణ డీకే తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా ఈ సిరీస్ కోసం తాము పడిన కష్టాన్ని వివరించారు. రెండో సీజన్‌లోనూ గూఢచారి శ్రీకాంత్ తివారి పాత్రలో మనోజ్ బాజ్‌పాయ్ అలరించనున్నారు. ప్రత్యర్థిగా, శక్తిమంతమైన రాజీ పాత్రలో సమంత నటించారు. జూన్ 4వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ వేదికగా ఫ్యామిలీమ్యాన్2 స్ట్రీమింగ్ కానుంది.
"సినిమా పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరూ దాని కోసం పడిన కష్టం గురించి చెబుతారు. 'ఫ్యామిలీమ్యాన్: సీజన్2' విషయానికొస్తే మాకు అత్యంత సవాళ్లతో కూడిన ప్రాజెక్టు ఇది. ప్రస్తుతం అందరం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. మనకు కలిగిన బాధ, నష్టం ఇంకెవరికీ కలగలేదు. కొందరు జీవితాలను కూడా కోల్పోవడం తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. ధైర్య సాహసాలతో పనిచేసిన ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ఎప్పటికీ రుణపడి ఉండాలి. విరామమే లేకుండా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేశారు" అని రాజ్, డీకే చెప్పుకొచ్చారు.
మహమ్మారి విజృంభించడం, రెండు లాక్‌డౌన్‌ల సమయంలోనూ నటీనటులు, సాంకేతిక బృందం, ప్రైమ్ వీడియో బృందం కష్టపడి పనిచేశారని, వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ‘ది ఫ్యామిలీమ్యాన్: సీజన్2’ ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. అయితే, అమెజాన్ వేదికగా వచ్చిన ‘తాండవ్’, ‘మీర్జాపూర్’ వివాదాలతో పాటు, సాంకేతిక సమస్యల కారణంగా ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ విషయంలోనూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా తమిళుల మనోభావాల కించ పరిచేలా సన్నివేశాలు ఉన్నాయని ఎంపీ వైగో ఆరోపించారు. అయితే, కొన్ని సన్నివేశాలు మాత్రమే చూసి, తమ సిరీస్‌పై అంచనాకు రావొద్దని ‘ఫ్యామిలీమ్యాన్’ టీమ్ చెబుతోంది.
ఇది చదవండి: కొన్ని గంటల్లో 'ఫ్యామిలీమ్యాన్ 2' ఉత్కంఠకు తెర!