తమిళ కథానాయకుడు విజయ్‌కు అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్‌లోనూ అభిమానులు ఉన్నారు. ఈ హీరో నటించిన చిత్రం 'బిగిల్'. తెలుగులో 'విజిల్' పేరుతో విడుదలైంది. అట్లీ దర్శకత్వం వహించాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇంతకుముందొచ్చిన 'పోలీస్' (తెరి), 'అదిరింది'(మెర్సల్) చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఫలితంగా 'విజిల్'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నేడు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతవరకు ఆకట్టుకుంది? అభిమానులతో విజిల్ వేయించగలిగిందా? లేదా తెలియాలంటే సమీక్ష చదవాల్సిందే
కథేంటంటే
మైఖేల్ అలియాస్ బిగిల్(విజయ్).. మురికివాడలో పుట్టి పెరిగిన కుర్రాడు. తండ్రి రాజప్ప(విజయ్) తన వాడ జనానికి అండగా నిలుస్తూ ముఠా నాయకుడిగా కొనసాగుతుంటాడు. తన కొడుకులాగే స్థానిక కుర్రాళ్లంతా మైదానంలో దిగి ఫుట్‌బాల్ ఆడటం చూసి సంతోషిస్తుంటాడు రాజప్ప. తన జీవితం ప్రభావం మైఖేల్‌పై పడకూడదని, తను మంచి ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా జాతీయ స్థాయిలో ఆడాలని ప్రోత్సహిస్తాడు. జాతీయ స్థాయిలో తన కొడుకు.. కప్పు కొట్టాలనేది రాజప్ప కల. కానీ ఫుట్‌బాల్ ఫెడరేషన్ రాజకీయాలకు బలై తన క్రీడా జీవితానికి స్వస్తి పలకాల్సి వస్తుంది. అలాంటి మైఖెేల్‌కు ఆంధ్రప్రదేశ్ మహిళల ఫుట్‌బాల్ జట్టుకు కోచ్‌గా అవకాశం ఎలా వచ్చింది? నిరాశలో ఉన్న మహిళా ఫుట్‌బాల్ జట్టును ఎలా ముందుకు నడిపించాడు? జాతీయ స్థాయిలో కప్పు కొట్టాలన్న తన తండ్రి కలను కోచ్‌గా ఎలా నిజం చేశాడు? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఎలా ఉందంటే
ఆట అంటేనే ఓ భావోద్వేగం. తలపడుతున్న రెండు జట్లలో ఒకరిది గెలుపు, మరొకరిది ఓటమి అని ముందే తెలుసు. కానీ ఫలితాన్ని మించిన ఆ ప్రయాణం ప్రేక్షకుడిని ఎంతో ఉత్కంఠకు గురిచేస్తుంటుంది. మైదానంలోని ప్రతి మలుపూ, ప్రతి క్షణం భావోద్వేగాల్ని రేకెత్తిస్తుంది. అందుకే క్రీడా నేపథ్యంలో సాగే సినిమాలు చాలా వరకు రక్తికట్టిస్తుంటాయి. అట్లీ... ఆటలోని భావోద్వేగాలకి తోడుగా, మహిళలకు సంబంధించిన మరిన్ని సామాజిక అంశాల్ని జోడించాడు. ఈ కారణంతో రెండింతల భావోద్వేగాలతో 'విజిల్'.. ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. కాకపోతే ద్వితీయార్ధం వరకు విజయ్ మాస్ మసాలా హంగామాను ఓపికగా చూడాల్సి ఉంటుంది. విజయ్‌కు తమిళనాట మాస్ అభిమానులు ఎక్కువ. వారిని దృష్టిలో ఉంచుకొనే తొలి భాగం సన్నివేశాల్ని తీర్చిదిద్దారు. అసలు కథ మైఖేల్ కోచ్‌గా మారినప్పుడే మొదలవుతుంది. అప్పటివరకు సాగిన కథలో కొత్తదనమేమీ కనిపించదు. ఫుట్‌బాల్ ఫెడరేషన్‌లో రాజకీయాలు, అక్కడి నుంచి బయటికి రావడం, అదే సమయంలో ఆటకి దూరమైన ధోనీ, కోహ్లీలాంటి ఇద్దరు మెరుపు క్రీడాకారిణుల్ని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం.. ఆ నేపథ్యంలో పండే డ్రామా ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఒక కోచ్‌గా జట్టును ముందుకు నడిపించేందుకు విజయ్ చేసే ప్రయత్నాలు, వాళ్లలో ఆవేశం, స్ఫూర్తి రగిలించేందుకు తీసుకొనే నిర్ణయాలు అలరిస్తాయి. పతాక సన్నివేశాలు.. గెలుపు నీదా నాదా అన్నట్లుగా ఉత్కంఠ భరితంగా సాగే మ్యాచ్‌ను చూసినట్టే అనిపిస్తాయి. సామాజికాంశాలతో పక్కా కమర్షియల్ సినిమాగా తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఎవరెలా చేశారంటే
విజయ్ నటనే చిత్రానికి ప్రధాన ఆకర్షణ. తండ్రీ కొడుకులు పాత్రల్లో మెప్పించాడు. ఆ రెండు కోణాలు మాస్‌ను అలరించేవే. అభిమానులు తన సినిమాల నుంచి ఏం కోరుకుంటారో అవన్నీ ఇందులో ఉండేలా జాగ్రత్తలు తీసుకొన్నాడు. అతడి డ్యాన్సులు, ఫైట్లు, సంభాషణలు ఆకట్టుకుంటాయి. మూడు కోణాల్లో పాత్ర తెరపై సందడి చేస్తుంది. ఆ మూడు కోణాల్ని పరిచయం చేసిన విధానం అభిమానులతో విజిల్స్ వేయిస్తుంది. నయనతార (ఏంజెల్ ఆశీర్వాదం) పాత్రకు ప్రథమార్ధంలో పెద్దగా ప్రాధాన్యం లేదు. ద్వితీయార్ధంలో మాత్రం ఆమె పాత్ర, నటన ఆకట్టుకుంటుంది. ఫుట్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు శర్మగా జాకీష్రాఫ్ మెప్పిస్తాడు. అతడి పాత్రతో వచ్చే మలుపులు చిత్రానికి ప్రధానబలం. అనువాదం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది.
చివరిగా: ద్వితీయార్థంలో 'విజిల్' కొట్టాల్సిందే
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
ఇవీ చూడండి.. సమీక్ష: వెండితెరపై వృద్ధ షూటర్లు అలరించారా.!