ఒకప్పుడు అడపాతడపా తెరకెక్కే మహిళా శక్తిని చాటే సినిమాలు ప్రస్తుత కాలంలో జోరుగా రూపొందుతున్నాయి. వాటిలో కొన్ని సంచలన విజయాలు నమోదు చేసుకుని, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. మరి కొన్ని సినిమాలు హిట్ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న హిందీ లేడి ఓరియెంటెడ్ సినిమాలపై ఓ లుక్కేద్దాం.
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవిత కథతో తెరకెక్కుతోన్న చిత్రం 'సైనా'. అమోల్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. పరిణీతి చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత జీవితకథ ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'తలైవి'. కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషిస్తుంది. ఏఎల్ విజయ్ దర్శకుడు. ఏప్రిల్ 23న విడుదల కానుందీ సినిమా.
హీరోయిన్ ఆలియాభట్ ప్రధాన పాత్రలో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న సినిమా 'గంగూబాయ్ కతియావాడి'. హుస్సేన్ జైదీ రచించిన 'మాఫీయా క్వీన్స్ ఆఫ్ ముంబయి'లోని 'మేడమ్ ఆఫ్ కామతిపుర' ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. జులై 30న ఈ సినిమా రిలీజ్ కానుంది.
బాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం 'తేజస్'. ఈ సినిమాలో కంగనా రనౌత్ ఎయిర్‌ఫోర్స్ పైలట్‌గా కనిపించనుంది. ఆర్‌ఎస్‌వీపీ ప్రొడక్షన్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ సినిమాకు.. రోనీ స్క్రూవాలా నిర్మాత. సర్వేశ్ మేవర దర్శకుడు.
నటి తాప్సీ ప్రధాన పాత్రలో 'రష్మి రాకెట్' సినిమా తెరకెక్కుతోంది. గుజరాత్‌కు చెందిన అథ్లెట్ రష్మీగా ఆమె కనిపించనున్నారు. ఆకాశ్ ఖురానా దర్శకత్వం వహిస్తున్నారు.
బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తోన్న తర్వాతి చిత్రం 'షెర్ని'. ఈ చిత్రానికి అమిత్ మసూర్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విద్యాబాలన్ అటవీ అధికారిణిగా కనిపించనుంది. అబున్‌దంతియా ప్రొడక్షన్స్ సమర్పణలో టీ-సిరీస్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి.. భూషణ్ కుమార్, విక్రమ్ మల్హోత్రా, కిషన్ కుమార్ నిర్మాతలు.
భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమా 'శభాష్ మిథు'. నటి తాప్సీ టైటిల్ రోల్ పోషిస్తోంది. 'పర్జానియా', 'రాయిస్'కు దర్శకత్వం వహించిన రాహుల్ ధోలాకియా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వయాకామ్ 18 స్టూడియోస్ నిర్మిస్తోంది.
స్పై థ్రిల్లర్ నేపథ్యంగా రూపొందుతోన్న 'ధాకడ్'లో ప్రధాన పాత్రలో నటిస్తోంది హీరోయిన్ కంగనా రనౌత్. కంగనా ఇందులో ఏజెంట్ అగ్ని పాత్రలో నటిస్తోంది. రజ్నీష్ ఘాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. అర్జున్ రాంపాల్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
తాప్సీ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న మరో చిత్రం 'హసీన్ దిల్రుబా'. ఈ చిత్రం రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఉంటుందని సినీ వర్గాలు చెప్పుకొంటున్నాయి. ఈరోస్ ఇంటర్నేషనల్, కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి వినిల్ మాథ్యూ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇవీ చదవండి: