సినిమా పెద్దదైనా.. చిన్నదైనా.. హీరో, హీరోయిన్, డైరెక్టర్లే కీలకమన్నది మనలో చాలామంది భావన. దాదాపు వాళ్లను చూసే సినిమాపై ఓ అంచనాకు వస్తాం. థియేటర్‌కు వెళతాం. నిజానికి వాళ్లే సినిమాకు కీలకం కావచ్చు.. మరి, కేవలం వాళ్లుమాత్రమే సినిమాను ముందుకు తీసుకెళ్లడం సాధ్యమా..? సినిమాలో ఎంతోమంది నటులు ఉంటారు. కానీ.. వాళ్లకు పై వరుసలో ఉన్నవాళ్లతో పోల్చితే సరైన గుర్తింపు రాదన్నది అందరం అంగీకరించాల్సిన విషయం. అయితే కొన్ని సినిమాలు మాత్రం ఇందుకు భిన్నం. అలాంటి సినిమాల్లో హీరో-హీరోయిన్లు, డైరెక్టర్లను మించి కేరెక్టర్ ఆరిస్టులు చెలరేగిపోతుంటారు. ప్రేక్షకులను థియేటర్‌కు రప్పిస్తుంటారు. అదే కోవలోకి వస్తారు గోపరాజు రమణ.
![who is 'middle class melodies' kondala rao?](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9649134_konda-1.jpg)
కొండల్‌రావు.. ‘మిడిల్‌క్లాస్ మెలోడీస్’ సినిమా చూసిన వాళ్లందరికీ గుర్తుండిపోయే పేరు. ఆ సినిమాలో ఓ అసంతృప్త తండ్రి పాత్రలో గోపరాజు రమణ జీవించారు. ఆయన నటన సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందని సినీ విశ్లేషకులే అంటున్నారు. ఎన్నో సినిమాల్లో తెరపై కనిపించినా గోపరాజుకు టన్నుల్లో ప్రశంసలు కురిపించింది మాత్రం ఈ సినిమానే. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. అయితే.. అందరి దృష్టిని ఆకర్షించిన పాత్రల్లో తండ్రి పాత్ర ఒకటి. నిజానికి ఎన్నో ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో గోపరాజు రమణ ఉన్నారు. అటు వెండితెర, ఇటు బుల్లితెరపై ఆయన 25 ఏళ్లుగా డబ్బింగ్ ఆర్టిస్టుగా పనిచేస్తున్నారు. అయినా.. ఈ సినిమాకు ముందు వరకూ ఆయన నటనకు తగ్గ పాత్ర తట్టలేదనే చెప్పాలి.
గోపరాజు రమణ తొలిసారిగా ‘గ్రహణం’ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించారు. దానికి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకులు. ఆ తర్వాత మాయాబజార్, గోల్కొండ హైస్కూల్, అష్టాచెమ్మా చిత్రాల్లోనూ నటించారు. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలోనూ ఆయన బాలకృష్ణ గురువుగా కనిపించారు. అయితే.. అన్నింట్లోనూ ఆయన చేసింది చిన్నపాత్రలే. అయితే.. యవ డైరెక్టర్ వినోద్ అనంతోజు ఆయనలోని నటనా సామర్థ్యాన్ని గుర్తించారు. అందుకే ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’లో హీరో తండ్రిగా కీలక బాధ్యతలు అప్పజెప్పారు. సినిమా సక్సెస్ రూపంలో అందుకు తగ్గ ప్రతిఫలం అందుకున్నారు.
![who is 'middle class melodies' kondala rao?](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9649134_konda-4.jpg)
‘‘ఏ నటుడికైనా ఎంత అనుభవం ఉన్నా నటన ఎప్పుడూ ఒక పరీక్షలాంటిదే. నటుడిగా డైరెక్టర్ ఏది కోరుకుంటున్నారో అది ఇవ్వడమే మన బాధ్యత. నా ఉద్దేశంలో మనం నిత్య విద్యార్థులం. జీవితాంతం నేర్చుకుంటూనే ఉండాలి. ఒకవేళ నా కొడుకు విజయ్ గోపరాజు దర్శకత్వం వహించినా నేను అతను చెప్పినట్లే వినాలి (విజయ్ దర్శకత్వం వహించిన చాలా నాటకాల్లో రమణ నటించడం గమనార్హం). మన నటనతో దర్శకులు సంతోషంగా ఉన్నారంటే మనం నిజమైన కళాకారులుగా ఎదుగుతున్నట్లు లెక్క” అని ఆయన చెప్పకొచ్చారు.
తనకు ఇన్ని ప్రశంసలు వస్తాయని ఎన్నడూ ఊహించలేదని అంటున్నారు కొండల్‌రావు. ఈ సినిమాతో తెలుగు సినిమా రంగంలో తన ప్రయాణం మరింత కొత్తగా మారుతుందని భావిస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘సినిమాల్లో థియేటర్ ఆర్టిస్టుల సంఖ్య కొన్నేళ్లుగా గణనీయంగా తగ్గిపోయింది. నా ప్రయాణం ఇలాగే సాగితే అది 10 మంది రచయితలు, థియేటర్ ఆర్టిస్టులను ప్రోత్సహిస్తుంది. నా ఏకైక కోరిక అదొక్కటే” అని ఆయన అంటున్నారు.
![who is 'middle class melodies' kondala rao?](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9649134_konda-3.jpg)