గాయాలతో ఆస్పత్రికి వచ్చిన బాలుడికి వైద్యులు 'బిగిల్' సినిమా చూపించి చికిత్స చేశారు. ఈ ఘటన చెన్నైలో జరిగింది. చెన్నైలోని మైలాపూర్‌కు చెందిన శశి అనే పదేళ్ల కుర్రాడు తన మేనమామతో కలిసి ద్విచక్ర వాహనంపై సరదాగా బయటకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు శశి బైక్‌పై నుంచి కింద పడిపోయాడు. దీంతో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాలుడ్ని చికిత్స నిమిత్తం రాయ్‌పేటలోని వైద్యశాలకు తీసుకువచ్చారు.
![vijays bigil](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12394429_vijay-1.jpg)
బాలుడ్ని పరీక్షించిన వైద్యులు తలకు తీవ్ర గాయాలయ్యాయని.. రక్తస్రావం కాకుండా ఉండేందుకు వెంటనే కుట్లు వేయాలని సూచించారు. కుటుంబసభ్యుల అంగీకారంతో వైద్యులు చికిత్స ప్రారంభించగానే.. మత్తు ఇంజక్షన్ ఇవ్వొద్దని బాలుడు మరాం చేశాడు. 'ఇంజక్షన్ ఇవ్వొద్దు' అంటూ గట్టిగా కేకలు వేస్తూ, భయంతో ఏడ్చాడు. దీంతో చికిత్స ఎలా చేయాలో వైద్యులకు అర్థం కాలేదు. అదే సమయంలో విధుల్లో ఉన్న మరో వైద్యుడు.. ఆ బాలుడితో కొంతసేపు ఫ్రెండ్లీగా మాట్లాడాడు. బాలుడికి ఏ హీరో అంటే ఇష్టమో అడిగి తెలుసుకున్నాడు. అనంతరం, బాలుడి ఇష్టప్రకారం తన ఫోన్‌లో 'బిగిల్' సినిమా ప్లే చేసి ఇచ్చాడు. బాలుడు సినిమాలో లీనం కాగానే వైద్యులు తమ పని పూర్తి చేశారు.