Tollywood Old Heroines Reentry in 2022: విరామాలు.. రీఎంట్రీలు సినీ పరిశ్రమకు కొత్తేమీ కాదు. తెరపై తళుక్కున మెరిసి.. వరుస విజయాలతో మెరుపులు మెరిపించి.. స్టార్లుగా నీరాజనాలు పొంది.. ఆ తర్వాత పరాజయాలతోనో.. వ్యక్తిగత కారణాల వల్లో చిత్రసీమకు దూరమైన తారలు అనేకమంది. గతంలో అలా ప్రేక్షకులను అలరించి తెరమరుగైన పలువురు సీనియర్ నాయికలు.. ఇప్పుడు మళ్లీ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. వైవిధ్యభరితమైన పాత్రలతో మురిపిస్తామంటూ. వెండితెరపైకి దూసుకొస్తున్నారు. ఇటీవల విడుదలైన 'రాధేశ్యామ్'లో భాగ్యశ్రీ అలా మెరిశారు. మరికొందరు సిద్ధమవుతున్నారు.
అనురాగాల అమ్మగా..
Akkineni Amala Sarvanand movie: ‘పుష్పక విమానం’, ‘శివ’, ‘నిర్ణయం’ వంటి పలు విజయ వంతమైన చిత్రాలతో దక్షిణాదిలో స్టార్ నాయికగా మెరుపులు మెరిపించారు అక్కినేని అమల. నాగార్జునతో పెళ్లి తర్వాత విరామం తీసుకున్న ఆమె... 2012లో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాతో వెండితెరపైకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రంలో హీరో తల్లిగా ఆమె కనబరిచిన అభినయం సినీప్రియుల మదిని తడి చేసింది. ఆ తర్వాత ఆమె వరుస సినిమాలతో జోరు చూపిస్తారని భావించినా.. మళ్లీ తెరపై కనిపించలేదు. ‘మనం’ క్లైమాక్స్‌లో అతిథి పాత్రలో అలా తళుక్కున మెరిసి మాయమయ్యారు. ఇప్పుడామె పదేళ్ల విరామం తర్వాత ‘ఒకే ఒక జీవితం’ కోసం మరోసారి ముఖానికి రంగేసుకున్నారు. శర్వానంద్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. శ్రీకార్తీక్ తెరకెక్కించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ ద్విభాషా చిత్రంలో శర్వాకు తల్లిగా నటించారు అమల. తల్లీకొడుకుల అనుబంధాల నేపథ్యంలో అల్లుకున్న ఓ ఆసక్తికర కథాంశంతో రూపొందింది. ఇది టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో ముడిపడి ఉంటుంది. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘విరాటపర్వం’తో ఆ ఇద్దరూ..
Rana Virataparvam Nandita das: ‘అమర ప్రేమ’, ‘హేమా హేమీలు’, ‘రక్తచరిత్ర’ చిత్రాలతో జరీనా వహాబ్.. ‘కమ్లీ’ సినిమాతో నందితా దాస్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమయ్యారు. ఒకప్పుడు బాలీవుడ్‌లో స్టార్ నాయికలుగా మెరిపించిన ఈ ఇద్దరూ.. దాదాపు పదిహేనేళ్ల తర్వాత ‘విరాటపర్వం’తో తెలుగు తెరపై సందడి చేయనున్నారు. రానా, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రమిది. వేణు ఊడుగుల తెరకెక్కించారు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. సురేష్‌బాబు సమర్పిస్తున్నారు. ప్రియమణి, నవీన్‌చంద్ర, నివేదా పేతురాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నక్సలిజం నేపథ్యంతో అల్లుకున్న ప్రేమకథతో రూపొందింది. మహిళలకు ఎంతో ప్రాధాన్యమున్న ఈ చిత్రంలో.. జరీనా, నందితా శక్తిమంతమైన పాత్రలు పోషించారు. ఇప్పటికే నిర్మాణాంతర పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘గాడ్‌ఫాదర్’తో.. అలనాటి ‘సీతాకోకచిలుక’?
Chiranjeevi Godfather Actress Aruna: ‘సీతాకోకచిలుక’ సినిమాతో వెండితెరకు పరిచయమై.. తొలి అడుగులోనే సినీప్రియులను మెప్పించిన నాయిక ముచ్చర్ల అరుణ. ‘జస్టిస్ లేఖ’, ‘బొబ్బిలి బ్రహ్మన్న’, ‘చంటబ్బాయ్’, ‘స్వర్ణకమలం’..ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి స్టార్ నాయికగా ఓ వెలుగు వెలిగింది అరుణ. పెళ్లి తర్వాత చిత్రసీమకు దూరమైన ఆమె.. దాదాపు 30ఏళ్ల విరామం తర్వాత తిరిగి తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఆమెను ‘గాడ్‌ఫాదర్’లోని ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేసినట్లు సమాచారం. నిజానికి ఈ పాత్ర కోసం తొలుత సీనియర్ నటి శోభనను సంప్రదించినట్లు వార్తలు వినిపించాయి. ఆఖరికి ఈ పాత్ర అరుణను వరించినట్లు ప్రచారం వినిపిస్తోంది. త్వరలో దీనిపై చిత్ర బృందం నుంచి స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోన్న ఈ చిత్రంలో.. నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో తళుక్కున మెరవనున్నారు.
అల్లరి పిల్ల.. మళ్లీ వస్తోంది..
Genelia Reentry movie: ‘హా.. హా.. హాసిని’ అంటూ తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి జెనీలియా. ‘బాయ్స్’, ‘సై’, ‘బొమ్మరిల్లు’, ‘ఢీ’.. ఇలా పలు విజయవంతమైన చిత్రాలతో నటించి మెప్పించిన ఈ భామ.. ‘నా ఇష్టం’ తర్వాత తెలుగు తెరపై కనిపించలేదు. ఇక పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైన ఈ అమ్మడు పదేళ్ల విరామం తర్వాత మళ్లీ తెలుగు తెరపై సందడి చేయనుంది. ప్రస్తుతం గాలి జనార్ధన్‌రెడ్డి తనయుడు కిరీటి హీరోగా పరిచయమవుతున్న చిత్రంలో ఆమె ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా.. త్వరలో రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించుకోనుంది. తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో రూపొందనున్న ఈ సినిమాని రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నారు. సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు.
‘చోర్‌బజార్’తో...
Akashprui Chorbajar movie Actress Archana: నిరీక్షణ, భారత్‌బంద్, లేడీస్ టైలర్ వంటి విజయంతమైన చిత్రాలతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన నటి అర్చన. ఉత్తమ నటిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ అలనాటి అందాల తార.. 25ఏళ్ల విరామం తర్వాత ‘చోర్ బజార్’తో తిరిగి ప్రేక్షకులను పలకరించనున్నారు. ఆకాష్ పూరి కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ‘జార్జ్‌రెడ్డి’ ఫేం జీవన్ రెడ్డి తెరకెక్కించారు. గెహన సిప్పీ కథానాయిక. విభిన్నమైన కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో అర్చన ఓ కీలక పాత్ర పోషించింది. ఆమెకు సంబంధించిన ఫస్ట్‌లుక్, పాటను ఇటీవలే విడుదల చేశారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ సినిమా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చూడండి: మహీంద్రా ఆఫీస్‌లో 'ప్రాజెక్ట్ కె'.. తొలి భారతీయ చిత్రంగా 'ఆర్ఆర్ఆర్'