ఒకప్పుడు ఓ చిత్రం పూర్తయిన తర్వాతే మరో చిత్రం గురించి ఆలోచించే వాళ్లు దర్శకులు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఓ సినిమా సెట్స్‌పై ఉండగానే మరొక కథను సిద్ధం చేసుకుని, ప్రముఖ హీరోలతో వాటిని ప్రకటించి ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతున్నారు. గతేడాది లాక్‌డౌన్ సమయం ఇందుకు కలిసొచ్చిందని చెప్పొచ్చు. మరోసారి కరోనా వ్యాప్తి పెరుగుతోన్న నేపథ్యంలో అనుకున్న సమయానికంటే కాస్త ఆలస్యంగా ఈ ప్రాజెక్టులు పట్టాలెక్కొచ్చు. ఇంతకీ ఆ దర్శకులెవరంటే...
ఆచార్యతోపాటు మరో రెండు..
చిరంజీవి, రామ్ చరణ్ కథానాయకులుగా కొరటాల శివ తీస్తోన్న చిత్రం 'ఆచార్య'. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. దేవాదాయ శాఖలో జరిగే అక్రమాల నేపథ్యంలో కమర్షియల్ హంగులతో ముస్తాబవుతోంది. చివరి దశ చిత్రీకరణలో ఉంది. ఈ చిత్రాన్ని మే 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు దర్శకనిర్మాతలు. మరోవైపు అల్లు అర్జున్ కథానాయకుడిగా గతేడాది ఓ చిత్రం ప్రకటించారు కొరటాల. 'ఏఏ 21' వర్కింగ్ టైటిల్‌తో సుధాకర్ మిక్కిలినేని నిర్మించనున్నారు. 2022 ఏప్రిల్‌లో పట్టాలెక్కే అవకాశాలున్నాయి. దీంతోపాటు ఇటీవలే ఎన్టీఆర్ కథానాయకుడిగా మరో సినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు కొరటాల. ఈ ప్రాజెక్టునూ సుధాకర్ మిక్కిలినేనే నిర్మిస్తున్నారు. ‘జనతా గ్యారేజ్’ తర్వాత కొరటాల-తారక్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం కావడం వల్ల అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.
పుష్పరాజ్.. విజయ్.. రామ్ చరణ్!
ప్రస్తుతం ‘పుష్ప’ చిత్ర పనులతో బిజీగా ఉన్నారు దర్శకుడు సుకుమార్. పాన్ ఇండియా స్థాయిలో పవర్‌ఫుల్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఎర్ర చందనం అక్రమ రవాణా కథాంశంగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఆగస్టు 13న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే 2020లో విజయ్ దేవరకొండతో తానొక చిత్రం చేస్తున్నట్టు సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించారు సుకుమార్. 2022లో ప్రారంభం కానుంది. కేదార్ సెలగంశెట్టి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దీంతోపాటు రామ్ చరణ్‌తోనూ మరోసారి కలిసి పనిచేసేందుకు సుకుమార్ కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ మంచి విజయం అందుకుంది.
ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత మహేశ్‌తోనేనా..!
ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్’ పనుల్లో ఉన్నారు దర్శకుడు రాజమౌళి. రామ్ చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. అక్టోబరు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రేజీ ప్రాజెక్టు అనంతరం రాజమౌళి ఎవరితో సినిమా చేస్తారా? అని ఎదురు చూస్తోన్న సినీ అభిమానులకు మహేశ్ బాబు సమాధానంగా నిలవనున్నారని సమాచారం. స్వయంగా రాజమౌళినే మహేశ్‌తో ఓ చిత్రం చేస్తా అని గతంలో తెలియజేశారు. అడవి నేపథ్యంలో సాగే కథ అని ఇటీవల ప్రచారం సాగింది. అయితే ‘ఆర్‌ఆర్‌ఆర్’ పూర్తయిన వెంటనే మహేశ్‌తో చేస్తారా? మరొక చిత్రం అనంతరం ఉండొచ్చా? అనేది తెలియాల్సి ఉంది.
ఎన్టీఆర్‌తో చేయాలి కానీ.. మహేశ్‌తో!
‘అల వైకుంఠపురములో’ చిత్ర విజయ ఉత్సాహంతో గతేడాది ప్రారంభంలోనే ఎన్టీఆర్ కథానాయకుడిగా ఓ సినిమా ప్రకటించారు త్రివిక్రమ్. హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఈ ఏడాది వేసవిలో విడుదల చేయాలని భావించినప్పటికీ కరోనా, ఇతరత్రా కారణాల వల్ల ఈ కాంబినేషన్ ఇంకా రూపుదాల్చలేదు. త్వరలోనే దీనిపై స్పష్టత రావొచ్చు. అయితే అనూహ్యంగా ఇప్పుడు త్రివిక్రమ్.. మహేశ్ బాబుతో ఓ చిత్రం చేస్తున్నారని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత ఈ ఇద్దరు కలిసి పనిచేయనున్నారు.
ఓ వైపు ప్రభాస్.. మరో వైపు తారక్
'కేజీయఫ్' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్. త్వరలోనే ‘కేజీయఫ్ 2’తో అంతకు మించిన వినోదం పంచేందుకు సిద్ధమవుతున్నారాయన. తెలుగు ప్రేక్షకుల అభిమానానికి కానుకగా ప్రభాస్, ఎన్టీఆర్‌తో చిత్రాలు తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో ‘సలార్’ సినిమాను ప్రకటించారు. ఈ సినిమా కొద్దిభాగం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టు అనంతరం తారక్‌తో ఓ సినిమా చేయనున్నారు ప్రశాంత్.
ఓ సీక్వెల్.. ఓ రీమేక్.. ఓ లాండ్‌మార్క్
కమల్ హాసన్ హీరోగా గతంలో వచ్చిన ‘భారతీయుడు’ చిత్రానికి కొనసాగింపుగా ‘భారతీయుడు 2’ మొదలుపెట్టారు దర్శకుడు శంకర్. అనివార్య కారణంగా గత కొన్ని నెలలుగా చిత్రీకరణ నిలిచింది. తాజాగా ఈ సినిమాను మళ్లీ సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. గతంలో విక్రమ్ కథానాయకుడిగా తను తెరకెక్కించిన ‘అపరిచితుడు’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నారు శంకర్. రణ్‌వీర్ సింగ్ హీరోగా రూపొందనుంది. వీటితోపాటు నిర్మాత దిల్ రాజు నిర్మించనున్న 50వ చిత్రానికి శంకరే దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ చరణ్ కథానాయకుడు.
అఖిల్‌తో.. పవన్ కల్యాణ్‌తో
అఖిల్‌తో ‘ఏజెంట్’ అనే చిత్రం తెరకెక్కిస్తున్నారు సురేందర్ రెడ్డి. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ సినిమా సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇది పూర్తయ్యాక పవన్ కల్యాణ్‌తో ఓ సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు సురేందర్.