తెలుగు సినిమాల్లో ఒకప్పుడు దుష్ట పాత్రలు అనగానే చలపతిరావే గుర్తుకొచ్చేవారు. ప్రతినాయకుడిగా, సహనటుడిగా, హాస్య నటుడిగా ఒదిగిపోయి ప్రేక్షకులపై ప్రత్యేక ముద్ర వేశారు. దాదాపు 1300కు పైగా సినిమాల్లో నటించారు. నిర్మాతగానూ వ్యవహరించారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం.
తొలిసారి ఎన్టీఆర్తో
చలపతిరావు అసలు పేరు తమ్మారెడ్డి చలపతిరావు. కృష్ణా జిల్లా, పామర్రు మండలంలోని బల్లిపర్రు స్వగ్రామం. మణియ్య, వియ్యమ్మ దంపతులకు జన్మించారు. చిన్నప్పుడే నాటకాలపై ఆసక్తి పెంచుకుని, స్నేహితులతో కలిసి వాటిని ప్రదర్శించేవారు. దానివల్ల చదువు సరిగా సాగలేదు. బాగా ఒడ్డు, పొడుగు ఉండటం వల్ల నాటకాల్లో కథానాయకుడిగా నటించేవారు. వందలాది నాటకాలు వేసిన ఆయన, ఎన్టీఆర్ నుంచి తొలి సినీ అవకాశాన్ని అందుకొన్నారు.
అన్నగారి ప్రభావమే
తన జీవితంలో దిగ్గజ నటుడు ఎన్టీఆర్ ప్రభావం బలంగా ఉందని చెప్పేవారు చలపతిరావు. ఎన్ని దుష్టపాత్రలు వేసినా.. తనకు వ్యక్తిగతంగా ఒక్క చెడు అలవాటు లేకపోవడం అన్నగారి ప్రభావమే అని చెబుతుంటారు. నిర్మాతలు ఎంతిస్తే అంత తీసుకొనే అలవాటున్న చలపతిరావు... ప్రతినాయకుడిగా వరుసగా సినిమాలు చేశారు. ఆయన చేసిన పాత్రల ప్రభావం వల్ల మహిళలు కొన్నిసార్లు తనను చూసినప్పుడు భయపడేవారని అన్నారు. తెరపై ఎలా కనిపించినా... నిజ జీవితంలో మాత్రం చాలా సరదా వ్యక్తిత్వమని ఈయన గురించి తెలిసినవాళ్లు చెబుతుంటారు.
అన్నీతానై
ముగ్గురు పిల్లలు పుట్టాక భార్య చనిపోవడం వల్ల, తన పిల్లలకు అన్నీ తానై పెంచారు చలపతిరావు. ఎన్టీఆర్, ఆయన సతీమణితో పాటు ఎంతోమంది ఆత్మీయులు ఈయనకు చెప్పినా మరో పెళ్లి చేసుకోలేదు. చలపతిరావు తనయుడు 'అల్లరి' రవిబాబు విజయవంతమైన దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా కొనసాగుతున్నారు. ఇద్దరమ్మాయిలు అమెరికాలో స్థిరపడ్డారు. తనతరం నటులు తెరకు దూరమైనా, ఈయన మాత్రం ఇప్పటికీ అవకాశాలు అందుకుంటున్నారు.