The Kashmir Files: దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తాజాగా విడుదల చేసిన 'ది కశ్మీర్ ఫైల్స్' బాక్సాఫీస్ వద్ద రికార్డ్ సృష్టించింది. విడుదలైన 8వ రోజు బాహుబలి 2కు చేరువగా కలెక్షన్లు చేసింది. దంగల్ మూవీ కంటే ఎక్కువగా కాసులు కురిపించింది. అక్షయ్ కుమార్ నటించిన 'బచ్చన్ పాండే' విడుదలైనప్పటికీ ఈ చిత్రం వసూళ్లలో జోరు కొనసాగిస్తోంది.
ట్రేడ్ నిపుణుడు తరణ్ ఆదర్శ్ 'ది కశ్మీర్ ఫైల్స్' వసూళ్లను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. "ది కశ్మీర్ ఫైల్స్ చరిత్ర సృష్టించింది. విడుదలైన ఎనిమిదవ రోజు రూ.19.15 కోట్లు వసూలు చేసింది. బాహుబలి2 (రూ.19.75 కోట్లు)కు సమానంగా వసూలు చేసింది. దంగల్ (రూ.18.59) కోట్ల కంటే ఎక్కువగా కాసుల పంట కురిపించింది. మొత్తంగా రూ.116.45 కోట్లు వసూలు చేసింది."అని చెప్పారు.
'ది కశ్మీర్ ఫైల్స్'కు మంచి క్రేజ్ రాగా.. నిర్మాతలు ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, కన్నడ, మలయాళంలోకి డబ్బింగ్ చేస్తున్నారు. 90వ దశకంలో కశ్మీర్ పండిట్‌లపై జరిగిన దారుణ మారణకాండకు దృశ్య రూపమే ఈ చిత్రం. 1990లో కశ్మీర్ హిందూ పండిట్‌లపై తీవ్రవాదులు, వేర్పాటువాదులు దాడులు చేశారు. వేల మంది పండిట్‌లను ఊచకోత కోయడమే కాక వారి ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో అనేక మంది పండిట్‌లు ప్రాణ భయంతో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. 32ఏళ్ల క్రితం జరిగిన ఈ దారుణ ఘటనలను 'ది కశ్మీర్ ఫైల్స్'లో ఎంతో భావోద్వేగభరితంగా కళ్లకు కట్టినట్లు చూపించారు వివేక్ అగ్నిహోత్రి. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం.. మార్చి 11న విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంటోంది.
ఇదీ చదవండి: Real Story Movies: వెండితెరపైకి యథార్థకథలు