'జయలలిత జీవితంపై సినిమా తీయడానికి, విడుదల చేయడానికి మేం చాలా కష్టాలు పడ్డాం. విడుదల తర్వాత జయలలితకు గొప్ప నివాళి ఇచ్చారనే ప్రశంసలు లభించాయి. ఆమె మేనల్లుడు దీప్ ఫోన్ చేసి మెచ్చుకున్నారు' అని చెప్పారు నిర్మాత విష్ణువర్ధన్ ఇందూరి. ఆయన శైలేష్ ఆర్.సింగ్‌తో కలిసి నిర్మించిన చిత్రం 'తలైవి'(Thalaivi Movie). తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటి జయలలిత జీవితం ఆధారంగా రూపొందిన చిత్రమిది. కంగన రనౌత్(Thalaivi Kangana Movie) ముఖ్యభూమిక పోషించారు. ఎ.ఎల్.విజయ్ దర్శకుడు. ఇటీవలే చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ ఇందూరి సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడారు.
"ఏ నిర్మాత కూడా తన సినిమాను వారం ముందే చూపించరు. కానీ నేను ప్రత్యేక ప్రదర్శనలు వేసి చూపించా. 'తలైవి'పై నాకున్న నమ్మకం అదే. మేం ఊహించినట్టుగానే సినిమా విజయం సాధించింది. పెట్టిన డబ్బు కంటే ఎక్కువే వెనక్కి వచ్చింది. అదే సమయంలో మంచి సినిమా చేశారనే ప్రశంసలు లభించాయి. థియేటర్ నుంచి వచ్చే వసూళ్ల మీదే మేం ఆధారపడలేదు. థియేటరేతర ఆదాయ మార్గాలపై కూడా దృష్టిపెట్టాం. ఆ హక్కులతో మేం పెట్టిన బడ్జెట్ మొత్తం తిరిగొచ్చింది. మా సినిమా క్రియేటివ్ ప్రొడ్యూసర్, నా భార్య బృందం వల్లే ఈ సినిమా మొదలైంది. జయలలిత చనిపోయినప్పుడు మూడు రోజులు ఆమెకు తిండి, నిద్ర లేదు. జయలలిత గురించి ప్రపంచం మొత్తం తెలుసుకోవాలనేది ఆమె ఆలోచన. అందుకే ప్రాంతీయ చిత్రంగా కాకుండా పాన్ ఇండియా చిత్రంగా ఈ సినిమాను తీయాలనుకున్నాం. ఇలాంటి కథను విజయేంద్రప్రసాద్ కంటే గొప్పగా ఎవరూ రాయలేరు. కంగనను ప్రధాన పాత్ర కోసం ఎంపిక చేశాక సరైన ఎంపిక కాదు అన్నారు. కానీ సినిమా చూశాక 'మీ నిర్ణయమే సరైంది' అన్నారు. ఆ విషయం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. మొదట్లో సినిమాపై జయలలిత కుటుంబ సభ్యులు కేసులు వేశారు. సినిమా చూశాక వారి నిర్ణయం మారింది. జయలలితకు గొప్ప నివాళి ఇచ్చారని మెచ్చుకున్నారు. తమిళనాడులో రోజు రోజుకీ థియేటర్లు పెంచుతున్నాం".
--విష్ణువర్థన్, నిర్మాత.
"నాకు బయోపిక్స్ అంటే ఇష్టం. ఇలాంటివి ఇంకా మూడు నాలుగు చిత్రాలు ప్లాన్ చేశాం. కపిల్‌దేవ్ బయోపిక్(Kapil Dev Biopic) '83'పెద్ద సినిమా. థియేటర్లో విడుదల చేయడం కోసం ఎదురు చూస్తున్నాం. సామాజిక మాధ్యమాలపై ఓ సినిమా చేయాలనుకుంటున్నా. 'ట్రెండింగ్' పేరుతో ఆ చిత్రం రూపొందుతుంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తాం. ప్రధానమంత్రి కార్యాలయం చుట్టూ తిరిగే మరో కథతోపాటు 'అజాద్ హింద్' అనే దేశభక్తి సినిమాని నిర్మించేందుకూ ప్రణాళికలు సిద్ధమయ్యాయి" అని విష్ణువర్థన్ అన్నారు.
ఇదీ చదవండి:Thalaivi review: కంగన రనౌత్ 'తలైవి'గా మెప్పించిందా?