పాత్ర నచ్చితే ప్రాణం పెట్టి నటించేస్తాడు. ఎంత కష్టంగా ఉన్నా.. దాని వల్ల నష్టం వస్తుందని తెలిసినా అనుకున్నది సాధించేవరకూ నిద్రపోడు. ఫలితం పట్టించుకోకుండా.. సరికొత్త ప్రయోగాలతో ప్రత్యేకంగా నిలవాలని తాపత్రయపడుతుంటాడు. ఓ రకంగా చెప్పాలంటే అతడో పట్టువదలని 'విక్రమా'ర్కుడు.. అందుకేనేమో అసలు పేరు కెన్నెడీ జాన్ విక్టర్ అయినా.. స్టేజ్ నేమ్ విక్రమ్ అని పెట్టుకున్నాడు. ఇప్పుడు అర్థమైంది కదా ఇదంతా మన 'అపరిచితుడు' గురించేనని. అతడు ఏడు పాత్రల్లో నటిస్తున్న 'కోబ్రా' సినిమా త్వరలో ప్రేక్షకుల రానుంది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మరోసారి ఈ హీరో సాహసం చేస్తున్నాడని విమర్శకులు, అభిమానులు మెచ్చుకున్నారు.

ప్రయోగాలకు 'సేతు'
అందమైన కాలేజీ కుర్రాడు ఓ అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమ కోసం తపిస్తాడు. ఇలాంటి పాత్ర ఎవరైనా చేస్తారు. మరి ఆ ప్రేమికుడు ప్రేయసి దక్కలేదని పిచ్చివాడై, అంద విహీనంగా తయారైతే..? ఆ చిత్ర కథ విషాదంతో ముగిస్తే..? ఇలాంటి కథను చేయడానికి ఏ నటుడైనా సంకోచిస్తారు. కానీ, విక్రమ్ దాన్నో సవాలుగా స్వీకరించాడు. 'సేతు' (తెలుగులో 'శేషు'గా రీమేక్ అయింది) సినిమాలో నటించి హిట్టు అందుకున్నాడు. అంతేకాదు పాత్ర కోసం దేనికైనా రెడీ అని నిరూపించాడు. అందుకే ఈ సినిమాకు తమిళనాడు రాష్ట్ర అవార్డు అందుకున్నాడు విక్రమ్.

నటనలో 'శివపుత్రుడు'
విక్రమ్ తన కెరీర్‌లో 'శివపుత్రుడు'తో మరోసారి మెప్పించాడు. లోకజ్ఞానం తెలియని కుర్రాడిగా, అమాయకంగా కనిపించాడు. అతడితో పాటు సూర్య, సంగీత, లైలా ప్రధాన పాత్రలు పోషింంచిన ఈ సినిమాకు బాలా దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను తమిళం, తెలుగు భాషల్లో విడుదల చేశారు. కన్నడలో రీమేక్ చేశారు. ఈ చిత్రంలో నటనకు గానూ విక్రమ్ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నాడు.

'అపరిచితుడు'.. ప్రేక్షకులకు సుపరిచితుడు
2005లో విక్రమ్ కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. 'అపరిచితుడు'లో అతడు పోషించిన మూడు వైవిధ్యమైన పాత్రలు ఆశ్చర్యపరిచాయి. రామానుజం, రెమో, అపరిచితుడిగా విక్రమ్ నటన నభూతో.. ముఖ్యంగా జైలులో ప్రకాశ్‌రాజ్, విక్రమ్ మధ్య వచ్చే సన్నివేశం.. ఒకే సమయంలో మూడు పాత్రల మధ్య వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ నటించిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సదా కథానాయిక. 2005లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విశేషమైన ఆదరణ దక్కించుకుంది.

'మల్లన్న'.. గెటప్‌లతో చంపేశాడన్నా!
అక్రమార్కులు కూడబెట్టిన సంపదను దోచి, దేవుడి పేరుతో పేదలకు పంచే ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం 'మల్లన్న'. సీబీఐ ఆఫీసర్‌గా పనిచేస్తూ వివిధ వేషాల్లో విక్రమ్ నటన అలరిస్తుంది. కోడిగా, మహిళగా, వృద్ధుడిగా వివిధ గెటప్‌ల్లో కనిపిస్తాడు విక్రమ్. శ్రియ కథానాయికగా నటించిన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించారు.

'ఐ' కోసం అంతకుమించి..
'అపరిచితుడు' తర్వాత విక్రమ్-శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'ఐ'. ఈ సినిమా కోసం మిస్టర్ ఆంధ్రాగా, మరోపక్క కురూపిగా నటించాడు. మిస్టర్ ఆంధ్రా గెటప్ కోసం సిక్స్‌ప్యాక్‌లో దర్శనమిచ్చిన విక్రమ్.. కురూపి పాత్ర కోసం కష్టపడి చాలా బరువు తగ్గాడు. ఆహార నియమాలు పాటించి సన్నగా అయిపోయాడు. ఈ సమయంలో అతడి ఆరోగ్యం కూడా చాలా క్షీణించింది. వైద్యులు హెచ్చరించినప్పటికీ లెక్కచేయని మొండితనం విక్రమ్‌ది. కానీ, అతడి కష్టానికి సరైన ఫలితం దక్కలేదు.

'ఇంకొక్కడు'.. కానీ సినిమాలో ఇద్దరు
చిత్ర పరిశ్రమలో ఫామ్‌లో ఉన్న కథానాయకుడు ట్రాన్స్‌జెండర్ పాత్రను పోషించడమంటే ఆషామాషీ కాదు. తేడా వస్తే.. అభిమానులు నిరాశ చెందుతారు. విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ విక్రమ్ దీన్ని కూడా ఛాలెంజ్‌గా తీసుకుని 'ఇరుముగన్' (తెలుగులో 'ఇంకొక్కడు')లో నటించాడు. 'రా' ఏజెంట్‌గా, 'లవ్'గా మెప్పించాడు. 'లవ్' పాత్ర కోసం తనను తాను చాలా మార్చుకున్నాడు. అతడి హావభావాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమాను ఆనంద్ శంకర్ తెరకెక్కించాడు.

ఏడు గెటప్‌ల్లో కోబ్రా
విక్రమ్ సరికొత్త ప్రయోగం 'కోబ్రా'. ఇందులో అతడు ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏడు గెటప్‌లలో కనిపించబోతున్నాడు. ఇటీవల ఫస్ట్‌లుక్ వచ్చింది. ఒక్క పాత్ర లుక్‌కు, మరోపాత్ర లుక్‌కు ఏ మాత్రం సంబంధం లేదు కదా.. కొన్ని గెటప్‌లు చూస్తే అక్కడున్నది విక్రమేనా అని ఆశ్చర్యపోయేలా ఉన్నాయి. తొలి ప్రచార చిత్రం అంచనాల్ని పెంచింది. మరి ఈ సినిమాతో అతడు ఎలా అలరించనున్నాడో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

ఇదీ చదవండి: 'ఆ సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలు తొలగించండి'