తెలుగు చలనచిత్ర యవనికపై ఆమె వైభవ ప్రాభవాలు సినీచరిత్రలో సువర్ణ లిఖితాలు. ఆమె ఆత్మగౌరవ పోరాటాలు నేటితరం నటీమణులకు స్ఫూర్తిదాయకాలు. ఆమె ప్రతిభా సామర్థ్యాలు, రూపలావణ్యాలు ఉత్తమ కథానాయికలకు ప్రామాణికాలు. ఆమె పోషించిన పాత్రలు అనురాగానికి, అనుబంధానికి, ప్రేమకు అద్దంపట్టినవే. ఆమె హావభావ విన్యాసం ముందు ఎన్నో క్లిష్టమైన సినిమా పాత్రలు సవినయంగా తలలు వంచాయి.
తెలుగింటి సత్యభామగా, గోదారి గౌరమ్మగా, పండంటి సంసారపు రాణీ మాలినీదేవిగా, కలెక్టర్ జానకిగా అలా ఎన్నో పాత్రల్లో ఒదిగిపోయి నటించిన ఆ ప్రామాణిక ప్రదర్శనలు మరే ఇతర నటీమణులూ పోషించనలేరు అనడంలో సందేహం లేదు. క్రమశిక్షణ, నిబద్ధమైన జీవనశైలి ఆమెకు ఆభరణాలు. ఆదర్శ గృహణిగా, సాంస్కృతిక సేవాభిలాషిగా అపజయ మెరుగని నిత్య చైతన్యదీప్తి. ఆమే... తెలుగు సినీ అభిమానుల లావణ్యరాశి... నిప్పాణి జమున. ఆగస్టు 30 (1936) ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా జమున సినీ ప్రస్థానం గురించి కొన్ని విషయాలను గుర్తు చేసుకుందాం...
బాల్యం అడుగుజాడలు...
జమున పుట్టింది చారిత్రాత్మక విజయనగర సామ్రాజ్య ముఖ్యపట్టణం హంపిలో. ఆమె మాతామహులు వెంకటప్పయ్య విజయనగర సంస్థాన ఆస్థాన విద్యాంసులు. పితామహులు నరసింగరావు న్యాయవాది. తల్లి కౌసల్యాదేవి హరికథాభాగవతారిణి, సంగీత విద్యాంసురాలు. తండ్రి శ్రీనివాసరావు విద్యాధికుడు, వ్యాపారవేత్త. ఆయన పసుపు, పత్తి వంటి వాణిజ్య పంటలను విదేశాలకు ఎగుమతి చేసేవారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల గ్రామం పసుపు పంటకు ప్రఖ్యాతి కావడం వల్ల జమున కుటుంబం ఆ గ్రామానికి వలసవచ్చింది. జమున తండ్రి దుగ్గిరాల నుండే వ్యాపార వ్యవహారాలను నిర్వహించేవారు.
చిన్నతనంలోనే దుగ్గిరాల రావడం వల్ల జమున తెలుగు అమ్మాయిగానే పెరిగింది. ఆ ఊరులోనే బాలికల పాఠశాలలో జమున విద్యాభ్యాసం కొనసాగింది. తల్లికి కళల మీద ఉన్న మక్కువతో జమునకు కూడా లలిత కళలమీద ఆసక్తి పెరిగింది. స్కూలు వేడుకల్లో, వార్షికోత్సవాలలో జమున ప్రార్థనా గీతాలు పాడడం, నాటకాల్లో పాత్రలు ధరించడం చేస్తుండేది. ఒకసారి దుగ్గిరాల నాటక సమాజం వారు ప్రదర్శించిన దిల్లీ చలో అనే సాంఘిక నాటకంలో హీరో చెల్లెలి వేషం వేస్తే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తర్వాత కొన్నాళ్లకు సుంకర-వాసిరెడ్డి నాటకం మాభూమిలో నటించే అవకాశం వచ్చినప్పుడు, బుర్రకథా పితామహుడు నాజర్ శిక్షణ ఇవ్వడం జమున జీవితంలో ఉద్వేగ క్షణాలు! అందులో నరక కూపమీ క్రూర నైజాం పాలన రైతన్నా అనే పాటను ఆలపించి ప్రేక్షకుల నుండి కరతాళ ధ్వనులు అందుకుంది. అదే నాటకాన్ని తెనాలి, విజయవాడ పట్టణాలలో ప్రదర్శిస్తే జమున కూడా ఆ బృందం వెంట వెళ్లి నటించి పేరు తెచ్చుకుంది. ఒకసారి తెనాలి సమీపంలోని మండూరులో దిల్లీ రాజ్యపతనం నాటకం వేయాల్సి వచ్చినప్పుడు, స్థానిక హైస్కూలులో టీచరుగా పని చేస్తున్న కొంగర జగ్గయ్య (ప్రఖ్యాత సినీనటులు) జమునను భుజాల మీద ఎక్కించుకొని తీసుకు వెళ్లడం జమున జీవితంలో మరపురాని సంఘటన.
సినిమా నటనపై ఆసక్తి
జమున బంధుమిత్రులు ఆమె తల్లితో అమ్మాయిని సినిమాల్లో చేర్పించండి, రాణిస్తుంది అంటూ సలహా ఇస్తుండేవారు. తల్లి విని వూరుకుండేది. కానీ జమున మనసులో సినిమాల్లో నటించాలనే బీజం తెలియకుండానే నాటుకుంది. జమున కౌమారదశకు చేరుకుంటున్నప్పుడు దుగ్గిరాల నీలం సంజీవరెడ్డి, జయప్రకాష్‌నారాయణ వంటి నాయకులు వచ్చి ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు. అందులో జమున ప్రార్థనాగీతం పాడింది. అది విన్న శ్రీమన్నారాయణమూర్తి అనే వ్యక్తి ఇంటికి వచ్చి, తను సినిమాల్లో హాస్య పాత్రలు వేస్తుంటానని, జమునను సినిమాల్లో ప్రవేశపెడితే మంచి నటిగా రాణిస్తుందని సలహా ఇచ్చి, అందుకు కావాల్సిన ప్రయత్నాలు చేస్తానని సెలవిచ్చి వెళ్లాడు. అతడు అన్న మాటలు జమున ఆశల్ని చిగురింపజేశాయి. జమున పెదతండ్రి ఆర్.ఆర్.నిప్పాణికి స్నేహితులైన గరికపాటి రాజారావుతో జమున కుటుంబానికి పరిచయం కలిగింది. ఆయన రాజమండ్రిలో ఛాయాగ్రాహకుడు వి.ఎన్.రెడ్డితో కలిసి సినిమా నిర్మించే ప్రయత్నాల్లో ఉన్నారు. జమున ఫొటోలను తీయించి బొంబాయిలో వి.ఎన్.రెడ్డికి పంపారు.
ఈలోగా శ్రీమన్నారాయణమూర్తి సిఫారసుతో బి.వి.రామానందం అనే సినీ నిర్మాత తను నిర్మించబోయే జై వీర బేతాళ అనే సినిమాలో జమునకు నటించే అవకాశాన్ని కలిపించారు. దాంతో జమున కుటుంబం మద్రాసు వెళ్లింది. కోడంబాకంలో ఉన్న స్టార్ స్టూడియోలో షూటింగు మొదలైంది. హీరో గుమ్మడి వెంకటేశ్వరరావు. ఆయనకూ ఇదే మొదటి సినిమా. అయితే కొన్ని రీళ్లు తీశాక జై వీర బేతాళ నిర్మాణం ఆగిపోయింది. ఈలోగా రాజారావు నిర్మించే పుట్టిల్లు సినిమాలో జమున పాత్ర ఖరారైంది. అయితే ఆ సినిమా విజయవంతం కాలేదు. అందులో హీరో రాజారావు యాభై ఏళ్ల వయసులో ఉండగా, జమున టీనేజి తార కావడం ఒక కారణం కాగా, వ్యసన పరుడైన భర్తను వదిలేసి హీరోయిన్ స్వతంత్ర జీవనం గడపడం ప్రేక్షకులకు నచ్చకపోవడం మరో కారణమైంది. తర్వాత జమునకు సెకండ్ హీరోయిన్‌గా నటించే అవకాశాలు వచ్చాయి. వాటిలో ముఖ్యమైనది సినీ పితామహుడు హెచ్.ఎం.రెడ్డి రోహిణి బ్యానర్‌పై రెండు భాషల్లో నిర్మించిన వద్దంటే డబ్బు సినిమా. అందులో జమున, పేకేటి శివరాంకు జోడీగా నటించింది. సినిమా బాగా ఆడలేదు. తర్వాత సారథి ఫిలిమ్స్ వారు నిర్మించిన అంతా మనవాళ్లే సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమా వందరోజులు ఆడింది. అలాగే కె.వి.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అన్నపూర్ణా వారి తొలి చిత్రం దొంగరాముడు సినిమాలో అక్కినేని నాగేశ్వరరావుకు చెల్లెలుగా నటించింది. అంతే... జమున దశ తిరిగింది. ఇక వెనక్కి చూసుకోవాలిసిన అవసరం రాలేదు.
హీరోయిన్‌గా నిలదొక్కుకుంటూ...
1954లో బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో నిర్మించిన వాహిని వారి బంగారుపాప, గోకుల్ ప్రొడక్షన్స్ వారి వదినగారి గాజులులో నటించిన జమునకు వెండితెర అగ్రనటులతో హీరోయిన్‌గా నటించే అవకాశాలు వెంటవెంటనే వచ్చాయి. విజయావారి మిస్సమ్మ సినిమాలో అమాయకంగా నటించిన జమునకు మంచి పేరొచ్చింది. గోకుల్ ప్రొడక్షన్స్ వారే నిర్మించిన నిరుపేదలు సినిమాలో అక్కినేని సరసన హీరోయిన్‌గా నటించగా ఆ సినిమా సరిగ్గా ఆడలేదు. యన్.టి.రామారావుతో నటించిన ఇద్దరు పెళ్లాలు సినిమా విషయంలో కూడా ఇదే పునరావృతమైంది. అయితే ప్రముఖ దర్శకనిర్మాత, బి.ఎన్.రంగా చిత్రం మాగోపిలో వల్లం నరసింహారావు సరసన జమున హీరోయిన్‌గా నటించగా, ఆ సినిమా శతదినోత్సవం చేసుకుంది.
తర్వాత బి.ఎన్.రంగా తెనాలి రామకృష్ణ (1956) సినిమా తీసినప్పుడు అక్కినేనికి జోడిగా జమున నటించింది. యన్.టి.రామారావుతో పొన్నలూరి బ్రదర్స్‌వారు నిర్మించిన భాగ్యరేఖ, వినోదా వారి చిరంజీవులులలో నటించగా అవి కూడా విజయవంతమయ్యాయి. దానితో హీరోయిన్ ప్రధానాంశాలు గల చిత్రాలకు జమున అచ్చుగుద్దినట్లు సరిపోతుందనే పేరు వచ్చింది. ఆ తర్వాత భూకైలాస్, పెళ్ళినాటి ప్రమాణాలు, అప్పుచేసి పప్పుకూడు, ఇల్లరికం, ఈడూజోడూ, రాముడు భీముడు, శ్రీకృష్ణ తులాభారం, గులేబకావళికథ, లేతమనసులు, ఉండమ్మా బొట్టుపెడతా, బొబ్బిలియుద్ధం, తాసిల్దారుగారి అమ్మాయి, మట్టిలో మాణిక్యం, ఏకవీర, పండంటి కాపురం వంటి సినిమాల్లో నటించి ఆమె తారాస్థాయికి చేరకుంది. సాహసానికి మారు పేరుగా నిలిచింది. కారణాలేవైనా అక్కినేని నాగేశ్వరరావు, యన్.టి.రామారావు దాదాపు నాలుగేళ్లపాటు జమునతో నటించకుండా బాయ్‌కాట్ చేశారు.
సంసారంలో జమున
1965లో పెద్దలు నిర్ణయించిన జూలూరి రమణారావుతో తిరుమల బాలాజీ సన్నిధిలో జమునకు వివాహం జరిగింది. అప్పుడు రమణారావు తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి చేస్తుండేవారు. వీరికి ఇద్దరు సంతానం. పెద్దబ్బాయి వంశీకృష్ణ అమెరికాలో స్థిరపడగా, కూతురు స్రవంతి పెళ్లిచేసుకొని హైదరాబాదులోనే స్థిరపడింది. 1983లో జమున రాజకీయ ప్రవేశం చేసింది. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయింది. తర్వాత రాజమండ్రి లోకసభ నియోజకవర్గం నుంచి 1989లో పోటీచేసి అరవైవేల మెజారిటీతో గెలిచింది. మధ్యంతర ఎన్నికలు రావడంతో రెండవసారి గెలుపు సాధ్యం కాలేదు. కాకినాడ వద్ద తోలుబొమ్మల కళాకారుల కోసం ‘జమునా నగర్’ అనే కాలనీని నిర్మించి వారికి ఆర్ధిక సహకారం అందించింది. కొంతకాలం మహిళా కాంగ్రెసు అధ్యక్షురాలిగా కూడా పనిచేసింది. జమున వంటి గొప్ప నటికి ‘పద్మ’ పురస్కారం ఇవ్వకపోవడం శోచనీయమే!
సాహస నటి
అక్కినేని, ఎన్టీఆర్ ఇద్దరూ జమునతో నటించబోమని ప్రతికాముఖంగా ప్రకటించారు. ఇక జమున పని అయిపోయిందనుకున్నారు. జమున షూటింగుకు లేటుగా వస్తుందని, పొగరబోతని, గర్విష్టని, కాలు మీద కాలువేసుకొని కూర్చుంటుందని, పెద్దల మీద గౌరవం లేదని కారణాలు చూపించారు. అవి బాయ్‌కాట్ చేయాల్సినంతటి సమంజసమైన కారణాలు కావని చిత్రపరిశ్రమకు తెలిసినా అగ్రనటుల ప్రమేయం ఉండడం వల్ల సమస్య పరిష్కారానికి ఎవరూ సాహసించలేదు. అసలు కారణం ఏమిటనేది జమున మనస్సాక్షికి మాత్రమే తెలుసు. ఆ కారణాన్ని ఇప్పటికీ చెప్పకపోవడం ఆమె గొప్పతనం. ఆ దశలో జగ్గయ్య, శోభన్‌బాబు, హరనాథ్, కృష్ణ, కృష్ణంరాజు వంటి హీరోలతో చాలా సినిమాలు చేసింది. ఆమెకు ఎప్పుడూ ఐదారు సినిమాలు చేతిలో ఉండేవి. అదే సమయంలో జమునకు హిందీ సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి. ఎల్వీప్రసాద్ నిర్మించిన హమ్ రాహి, బేటీ బేటీ సినిమాల్లో నటించింది. విజయా వారు గుండమ్మ కథ సినిమా నిర్మాణానికి పూనుకుంటూ ఎన్టీఆర్ సరసన సావిత్రిని, అక్కినేని సరసన జమునను నటింపజేయాలని నిర్ణయించారు. వీరి మనస్పర్థల వలన అప్పటికే గుండమ్మ కథ రెండేళ్లు వెనకబడింది. చక్రపాణి, కె.వి.రెడ్డి రాజీయత్నాలు మొదలుపెట్టారు. అగ్రనటులిద్దరికీ క్షమాపణ పత్రం రాసి ఇవ్వమని జమునకు సలహా ఇచ్చారు. కానీ ఈ ధీర వనిత ససేమిరా అంది. చేయని నేరానికి నాలుగేళ్లపాటు హింసపెట్టిన వారికి క్షమాపణ ఎందుకు చెప్పాలి? అంటూ ఎదురు ప్రశ్నించింది. ఇక లాభం లేదని చక్రపాణి ముగ్గురినీ కూర్చోబెట్టి, చనువుకొద్దీ వారిని చీవాట్లు పెట్టి ఇక అందరూ కలిసి పనిచేయండి. అవతల నా గుండమ్మ ఏడుస్తోంది అంటూ చమత్కరించి పరిష్కారం చేశారు. తర్వాత వీరి కాంబినేషన్‌లో గులేబకావళి కథ, మూగమనసులు, మురళీకృష్ణ, రాముడుభీముడు, శ్రీకృష్ణ తులాభారం సినిమాలు వచ్చాయి.
మరిన్ని విశేషాలు..
బాబూ మూవీస్ వారి మూగమనసులు చిత్రంలో నటనకు 1964లో జమునకు ఫిలింఫేర్ వారి ఉత్తమ సహాయనటి బహుమతి లభించింది. మరలా 1968లో అదే గౌరి పాత్రను హిందీ ‘మిలన్’ చిత్రంలో జమున పోషించింది. అందులో నటనకు కూడా ఆమెకు మరొకసారి ఫిలింఫేర్ వారి ఉత్తమ సహాయనటి బహుమతి లభించింది. 2008లో యన్.టి.ఆర్ జాతీయ పురస్కారం అందుకుంది.
సత్యభామ అంటే జమునే అనే అభిప్రాయం సినీ అభిమానుల్లో నాటుకుపోయిన అభిప్రాయం. ఆ పాత్రలో మరొకరిని ఊహించుకోవడం కూడా కష్టమే. తొలిసారి వినాయక చవితి (1957) చిత్రంలో సత్యభామ పాత్రను జమున పోషించింది. శ్రీకృష్ణ తులాభారంలో ఆమె పోషించిన సత్యభామ పాత్ర నటనలో పరాకాష్ట అని చెప్పవచ్చు.
ఇది చూడండి నందమూరి హరికృష్ణ వర్థంతి సందర్భంగా బాలకృష్ణ నివాళి