కర్ణాటకలోని డ్రగ్స్ కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. ప్రముఖ యాంకర్ అనుశ్రీకి ఇదే విషయమై నోటీసులు జారీ చేయగా, ఆమె పోలీసుల ఎదుట శనివారం హాజరైంది. దాదాపు మూడు గంటలపాటు విచారించారు. ఈ కేసుతో సంబంధముందనే ఆరోపణల నేపథ్యంలో డ్యాన్సర్ కిశోర్ శెట్టి, రాజ్‌తరుణ్‌ను ఇప్పటికే అరెస్టు చేశారు.
తరుణ్ తనకు 12 ఏళ్లుగా తెలుసని, అతడి స్నేహితుడు కిశోర్ శెట్టి ఆరు నెలల పాటు డ్యాన్స్‌లో శిక్షణ ఇచ్చాడని అనుశ్రీ తెలిపింది. వీళ్లతో ఎలాంటి పార్టీలకు హాజరు కాలేదని, డ్రగ్స్‌తో అసలు సంబంధం లేదని చెప్పింది. పోలీసులు అడిగిన అన్నింటికీ సమాధానం ఇచ్చానని మీడియాకు వెల్లడించింది. మళ్లీ సమన్లు ఇచ్చినా విచారణకు వచ్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది.
"మా రాష్ట్రాన్ని(కర్ణాటక) డ్రగ్ మాఫియా దెయ్యంలా పట్టుకుంది. దీని మూలాలను పెకిలించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మేం వారికి సహకరిస్తాం" -అనుశ్రీ, ప్రముఖ యాంకర్
కిశోర్ ఇచ్చిన పలు పార్టీలకు తనతో పాటు అనుశ్రీ వచ్చిందని రాజ్ తరుణ్ చెప్పడం వల్లే ఆమెకు పోలీసులు సమన్లు జారీ చేశారు.