కథానాయిక అంటేనే గ్లామర్. గ్లామర్ అంటేనే కథానాయిక. ఇద్దరు ముగ్గురు కథానాయికల గ్లామర్‌ని కోరుకునే కథలు కూడా కొన్ని ఉంటాయి. అలాంటప్పుడే.. చిన్నదో వైపు, పెద్దదో వైపు అంటూ ఆడిపాడుతుంటాడు హీరో. అయితే కథానాయికలు ఎంతమంది ఉన్నా.. మధ్యలో జిగేల్ రాణి వచ్చి వెళితే కానీ ఆ కథకు ఊపు రాదు, హీరోకూ ఉత్సాహం రాదు.
అంతకంటే కూడా చూసే మాస్ ప్రేక్షకుడికీ సినిమా ఆస్వాదన పరిపూర్ణం కాదు. అందుకే దర్శకులు కథ మధ్యలో ఓ ప్రత్యేక గీతానికి చోటిచ్చి.. ప్రత్యేక భామల్ని రంగంలోకి దించుతుంటారు. ఆ పాటలు సినిమాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. ఒకప్పుడు ఆ పాటల్లో ఐటెమ్ భామలుగా పేరు పడ్డ అందగత్తెలే సందడి చేసేవారు. కథానాయికలు కూడా ఆడిపాడటం మొదలయ్యాక ఎప్పటికప్పుడు కొత్త జిగేల్ రాణీల జాబితా పుట్టుకొచ్చేస్తోంది. ఇప్పుడు ఆ జాబితాలో సమంత, ఫరియా అబ్దుల్లా, రష్మీ తదితరులు చేరారు.
ప్రత్యేక గీతానికి చాలా ప్రత్యేకతే ఉంటుంది కొన్నిసార్లు ఆ ఒక్క పాటే ప్రేక్షకుడిని థియేటర్ వరకు తీసుకొస్తుంటుంది. అందుకే దర్శకనిర్మాతలు దానికి మరిన్ని హంగులు జోడించడం మొదలుపెట్టారు. కోట్ల రూపాయల పారితోషికం ఇచ్చి అగ్ర హీరోయిన్లతో ఆ పాటల్ని చేయిస్తున్నారు. కోట్ల రూపాయలతో సెట్స్ వేసి వాటిని తెరకెక్కిస్తున్నారు. ఆ పాట కోసం ప్రత్యేకమైన కసరత్తులే జరుగుతుంటాయి.
'రంగస్థలం' సినిమాలో అగ్ర కథానాయిక పూజాహెగ్డే జిగేల్ రాణిగా ఊపేసింది. ఈసారి మరో అగ్ర కథానాయిక సమంతను తన చిత్రం 'పుష్ప' కోసం ఎంపిక చేశారు సుకుమార్. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో భారీ హంగుల నేపథ్యంలో ఆమెపై పాటను తెరకెక్కించారు. సమంత చేసిన తొలి ప్రత్యేక గీతం ఇదే. మరి ఆ పాట ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.
బంగార్రాజు పాట
నాగార్జున సినిమా 'బంగార్రాజు'లో కూడా ప్రత్యేక గ్లామర్ కూసింత ఎక్కువే ఉండబోతోంది. 'లడ్డుండ..' అనే పాటలో పలువురు నాయికలు కనిపిస్తారు. కల్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతం కూడా ఉంటుందట. ఆ పాటలో ‘జాతిరత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా ఆడిపాడుతోందని తెలుస్తోంది. మరి ఈ కుర్రభామ ఫరియాతో కలిసి నాగార్జున ఆడిపాడారా లేక ఆయన తనయుడు నాగచైతన్యనా అనేది తెలియాల్సి ఉంది. 'బంగార్రాజు'లో యువ మన్మథుడుగా నాగచైతన్య కూడా నటిస్తున్నారు.
భోళా... అందం భళా
బుల్లితెరపై సందడి చేస్తూ ఇంటింటికీ చేరువైన భామ రష్మికి చిరంజీవితో ఆడిపాడే అవకాశం దక్కింది. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న 'భోళా శంకర్'లో ఓ ప్రత్యేక గీతం ఉంటుందట. ఆ పాట కోసం రష్మిని ఎంపిక చేశారు.
ప్రత్యేక గీతాల కోసమే కాదు, అదనపు అందం జోడించాలనే ప్రయత్నంలో కూడా కొంతమంది కథానాయికల్ని ఎంపిక చేసుకుంటుంటారు. 'ఎఫ్3'కి ప్రత్యేక అందాన్ని జోడించడం కోసం సోనాల్ చౌహాన్‌ను ఎంపిక చేశారు. ఆమె పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అందులో తమన్నా, మెహరీన్ కథానాయికలుగా నటిస్తున్నారు.
ఈ ఏడాది ఇప్పటికే 'రెడ్' సినిమాలో డించక్ డించక్ అంటూ హెబ్బా పటేల్, భూమ్ బద్దల్ అంటూ 'క్రాక్'లో, పెప్సీ ఆంటీ అంటూ 'సీటీమార్'లో అప్సరారాణి, 'చావు కబురు చల్లగా'లో అనసూయ ప్రత్యేక అందాన్ని ఒలికించిన విషయం తెలిసిందే. దీంతో రాబోయే ప్రత్యేక గీతాలు సినీ ప్రేక్షకుడిలో మరిన్ని అంచనాల్ని రేకెత్తిస్తున్నాయి.
ఇవీ చదవండి: