మెగా వారి కాంపౌడ్‌లో పెళ్లి సందడి షురూ అయ్యింది. నటుడు నాగబాబు కుమార్తె నిహారిక వివాహ సుముహూర్తం దగ్గరవుతున్న తరుణంలో మెగా కుటుంబంలో పార్టీలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే మెగా డాటర్స్ అందరూ కలిసి నిహారికకు ప్రత్యేకంగా డిన్నర్ పార్టీ ఇవ్వగా.. తాజాగా వధూవరులిద్దరికి ఓ సర్‌ప్రైజ్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు తమ కుటుంబంలోకి చైతన్యను ఆహ్వానిస్తూ.. సుస్మిత, శ్రీజ దంపతులు బుధవారం రాత్రి ఓ స్పెషల్ పార్టీ ఇచ్చారు. వరుణ్‌తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు అర్జున్ సతీమణి స్నేహా, బన్నీ సోదరులు శిరీష్, వెంకటేశ్ దంపతులు ఇతర మెగా-అల్లు కుటుంబసభ్యులు ఈ వేడుకల్లో సందడి చేశారు.

పార్టీకి సంబంధించిన ఫొటోలను కల్యాణ్ దేవ్ తాజాగా ఇన్‌స్టా వేదికగా షేర్ చేస్తూ.. "సెలబ్రేషన్స్ ప్రారంభయ్యాయి. రాత్రి పార్టీ చాలా సంతోషంగా జరిగింది. ఎప్పటికీ గుర్తుండిపోతుంది" అని అన్నారు. పార్టీతో తనకి ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు అందించిన శ్రీజ, సుస్మితలకు చైతన్య కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు, చైతన్యను తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ సుస్మిత.. నిహారిక-చైతన్యల ఫొటోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వేడుకలకు సంబంధించిన చిత్రాలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. సదరు ఫొటోలు చూసిన అభిమానులు.. రామ్‌చరణ్, అల్లు అర్జున్ ఎక్కడ? అంటూ కామెంట్లు చేస్తున్నారు.
గుంటూరు ఐజీ జె.ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యతో ఆగస్టులో నిహారికకు నిశ్చితార్థం జరిగింది. డిసెంబర్ 9న ఉదయ్‌పూర్‌లోని ఉదయ్‌విలాస్‌లో పెళ్లి జరగనుంది. దీంతో ఇటీవల నిహారిక తన స్నేహితులకు బ్యాచిలరేట్ పార్టీ కూడా ఇచ్చారు.


