సినిమా చిత్రీకరణలపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపిందని, ప్రస్తుత పరిస్థితుల్లో షూటింగ్‌లు చేయడం సమస్యలతో కూడుకున్నదని సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అభిప్రాయపడ్డారు. పవన్ కీలక పాత్రలో నటిస్తున్న 'వకీల్ సాబ్' దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకోగా, క్రిష్ దర్శకత్వంలో ఓ చిత్రం సెట్స్‌పైన ఉంది. లాక్‌డౌన్, కరోనాతో ఈ రెండు చిత్రాలూ ప్రస్తుతం తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కొత్త సినిమా ప్రాజెక్టుల గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
"కరోనా వల్ల షూటింగ్‌లన్నీ ఆగిపోయాయి. అవి ఎప్పుడు మొదలవుతాయో తెలియదు. అందరూ భౌతిక దూరం పాటించాలి. తొందరపడి షూటింగ్‌లు మొదలుపెడితే కష్టాలు పడాల్సి వస్తుంది. ఇటీవల తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను సినీ పరిశ్రమకు చెందిన పలువురు పెద్దలు కలిశారు. ఇరు ప్రభుత్వాలు నిబంధనలతో కూడిన అనుమతులు ఇచ్చాయి. అయినా, చిత్రీకరణలు జరిపే పరిస్థితులు లేవు. ఆ సమయంలో ఎవరు కరోనా బారిన పడినా ఇబ్బందే. అంతెందుకు బిగ్‌బీ అమితాబ్‌జీ కరోనా బారిన పడ్డారు. వ్యాక్సిన్ వచ్చే వరకూ నిస్సహాయతతో అంతా వేచి చూడాల్సిందే’."
-పవన్ కల్యాణ్, హీరో
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'వకీల్‌సాబ్'. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా వేసవి కానుకగా విడుదల కావాల్సి ఉంది. లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. 'పింక్' రీమేక్‌గా ఇది తెరకెక్కుతోంది. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో పవన్ ఓ చారిత్రక కథలో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాల తర్వాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో నటించనున్నారు.