Bappi lahiri career
ఆకాశంలో ఏ తార పిలిచిందో?
తనకు కొత్త స్వరాలు కావాలని...
ఆ లోకంలో ఎవరు ఆహ్వానించారో?
డిస్కో పాటలు పాడుదువు రమ్మని..
అందుకేనేమో బప్పీ లాహిరీ...
మనల్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు.
'ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ'... అంటూ తెలుగు సినీ సంగీత ప్రియులు పాడుకునేలా చేసిన సంగీత కెరటమాయన. ఇక అదే ఆకాశంలో మెరవడానికి ఇక్కడి నుంచి పయనమయ్యారు.
'చుక్కల పల్లకిలో...చూపుల అల్లికలో' అంటూ ప్రేమ గీతం
పల్లవించినా...'వానా వానా వెల్లువాయే' అంటూ ప్రణయ తరంగాల మోత మోగించిన బప్పిలహిరి స్వరాలు... మన మనసుకు ఉల్లాస హారాలయ్యాయి. 'పాపా రీటా...'అంటూ డిస్కో సంగీతంతో ముంచెత్తిన.. 'బోయవాని వేటుకు గాయపడిన కోయిల' అంటూ మధురంగా మెలోడీతో అలరించిన... ఆయన పాటల హోరు... మన గుండెల్లో జోరు పెంచాయి.
ఇక మీదట ఆయన గంధర్వ లోకాన్ని డిస్కో ఆడించవచ్చేమో...! ఇప్పటికే ఆయన మనకిచ్చిన స్వరాలు మాత్రం అమృతఝరులై సంగీతప్రియుల గుండెల్లో వినిపిస్తూనే ఉంటాయి.
Bappi lahiri Disco king: "డిస్కో ఎలక్ట్రానిక్ సంగీతం నడిచొస్తుంటే బప్పీలానే ఉంటుంది. ఒంటి నిండా రకరకాల ఆభరణాలతో బంగారు కొండలా మెరిసిపోయే ఆయన ఆహార్యమూ ఆ పాటల్లాగే ఎప్పటికీ ప్రత్యేకమే." అని అభిమానుల ప్రశంసలందుకొనే బప్పీలాహిరీ 1952 నవంబరు 27న పశ్చిమబెంగాల్‌లోని జల్‌పాయ్‌గురిలో జన్మించారు. ఆయన అసలు పేరు అలోకేష్ లాహిరీ. ఆయన తల్లిదండ్రులు అపరేష్ లాహిరీ, బాన్సురి లాహిరీ. ఇద్దరూ శాస్త్రీయ సంగీత గాయకులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. వాళ్లకు ఒక్కగానొక్క సంతానం బప్పీ. మూడేళ్లకే తబల వాయించడంతో మొదలుపెట్టిన చిచ్చరపిడుగు ఆయన.
బెంగాలీ చిత్రం ‘దాదు’తో సంగీత దర్శకుడిగా ఆయన తొలి అవకాశం అందుకున్నారు. హిందీలో ఆయన తొలి చిత్రం ‘నన్హా షికారి’. ఈ చిత్రంలోని ‘తు మేరీ మంజిల్..’ పాటకు స్వరాలు అందివ్వడంతో 21 ఏళ్ల వయసులో ఆయన బాలీవుడ్ ప్రయాణం మొదలైంది. ‘జఖ్మీ’ చిత్రంలోని ‘జల్తా హై జియా మేరా..’ ‘నథింగ్ ఈజ్ ఇంపాజిబుల్..’ పాటలకు అందించిన స్వరాలు మంచి గుర్తింపు తెచ్చాయి. ఆ తర్వాత ఆయన సంగీతం అందించిన ‘చల్తే చల్తే’ చిత్రంలోని ప్రతి పాట శ్రోతల్ని అలరించింది. దీంతో ఆయన పేరు జాతీయ స్థాయిలో మారుమోగింది. ఈ చిత్రంలో ‘జానా కహా హై...’ గీతం గాయకుడిగానూ బప్పీకి ఎంతో మంచి పేరు తెచ్చింది. ఇక ఆ తర్వాత ఆయన వెను తిరిగి చూసుకోలేదు. బాలీవుడ్‌లో ఉవ్వెత్తున ఎగిసిపడే సంగీతం కెరటంలా స్వరాలతో అలరించారు.
యువతను ఆకట్టుకొని
Bappi lahiri disco dancer: డిస్కో డ్యాన్సర్ చిత్రంలో ‘ఐ యామ్ ఎ డిస్కో డ్యాన్సర్’ పాట యువ తరాన్ని ఊపేసింది. ‘సాహెబ్’, ‘డ్యాన్స్ డ్యాన్స్’, ‘గురు దక్షిణ’, ‘కమాండో’, ‘గురు’, ‘ప్రేమ ప్రతిజ్ఞ’, ‘త్యాగి’, ‘రాక్ డ్యాన్సర్’, ‘ది డర్టీ పిక్చర్’, ‘బద్రినాథ్ కీ దుల్హనియా’ లాంటి చిత్రాల్లో బప్పీ స్వరపరిచన పాటలు శ్రోతల్లో మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి.
'బంగారు కొండ'
Bappilahiri Gold man: ఒళ్లంతా బంగారు ఆభరణాలతో మెరిసిపోయే బప్పీ స్టైల్ వెనుక ఓ కథ ఉంది. ‘జఖ్మీ’ సినిమా విజయవంతమైన సందర్భంగా బప్పి తల్లి ఆయనకు హరే రామ హరే కృష్ణ లాకెట్ ఉన్న బంగారు గొలుసుని బహుమతిగా ఇచ్చారు. ఇక ఆ తర్వాత ప్రతి పాట హిట్ కావడంతో బంగారంతో అదృష్టం వచ్చిందని ఒంటినిండా బంగారు ఆభరణాలతో తనకంటూ ఓ స్టైల్‌ను సృష్టించుకున్నారు. అప్పట్లో ‘గోల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ అని అభిమానులు ఆయన్ని ముద్దుగా పిలుచుకునేవారు. ఈ నిలువెత్తు బంగారం స్టైల్ వెనుక బప్పీకి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి ఉన్నారు. "నన్ను నేను అలా తీర్చిదిద్దుకోవడానికి కారణం అమెరికన్ గాయకుడు ఎల్విస్ ప్రెస్లీ. ఆయన్ని చిన్నతనంలో ఓ సారి చూశాను. ఆయన చుంకీ బంగారు ఆభరణాలు ధరించి మెరిసిపోయేవారు. వాటితో పాటు నల్లకళ్లద్దాలు ధరించి భలేగా కనిపించే వారు. అది మనసులో ముద్రపడిపోయింది. దాంతో నేనూ నా స్టైల్లో బంగారు ఆభరణాలను ధరించడం మొదలుపెట్టాను" అని ఓ సందర్భంలో చెప్పారు. బంగారం అంటే బప్పీకి ఎంత ఇష్టమంటే ‘గోల్డ్ ఈజ్ మై గాడ్’ అనేవారు. కెరీర్‌లో తను ఎదిగే కొద్దీ తనవద్ద బంగారం పెరుగుతూ వచ్చిందని ఓ సందర్భంలో చెప్పారాయన.
సంగీతంతోనే వారసుల ప్రయాణం
Bappi lahiri family: సంగీతం అనేది బప్పీకి తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చింది. ఆయన భార్య చిత్రాణి గాయనే. ఆయనకు ఇద్దరు సంతానం. కూతురు రేమ గాయనిగా మంచి పేరు తెచ్చుకుంది. కుమారుడు బప్పా లాహిరీ బాలీవుడ్‌లో సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యాడు.
గిన్నిస్ బుక్‌లో స్థానం
Bappilahiri Ginnis book record: 'హిమ్మత్‌వాలా' చిత్ర విజయంలో కీలకంగా నిలిచాయి ఆయన పాటలు. జితేంద్ర, శ్రీదేవి జంటగా కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ సినిమా 1983లో వచ్చింది. ఈ సినిమా తర్వాత 83-85 మధ్య కాలంలో జితేంద్ర నటించిన 12 సిల్వర్ జూబ్లీ చిత్రాలకు సంగీతం అందించి రికార్డు సృష్టించారు బప్పీ. ఉత్తరాదితో పాటు దక్షిణాదిలోనే వరస చిత్రాలతో క్షణం తీరిక లేని బప్పి 1986లో ఏకంగా 33 సినిమాలకు స్వరాలు అందించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నారు.
పేరడిగిన మైఖేల్ జాక్సన్
Bappilahiri mickel jackson: డిస్కో కింగ్‌గా పేరొందిన బప్పిలహిరిని పాప్‌సింగర్ మైఖేల్ జాక్సన్ మెచ్చుకున్న సందర్భం ఆయన మనసులో నిలిచిపోయింది. "పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ 1996లో భారతదేశానికి వచ్చినప్పుడు ఓసారి ముంబయిలో నన్ను కలిశారు. నా ఒంటి మీద ఉన్న బంగారం చూసి 'మీరు ధరించిన బంగారు ఆభరణాలు చాలా బాగున్నాయి'..మీ పేరేంటి? అని అడిగారు. 'నా పేరు బప్పి లహిరి' అని చెప్పగానే 'మీరు సంగీత దర్శకుడు కదా. మీరు సంగీతం అందించిన 'డిస్కో డ్యాన్సర్'లోని 'జిమ్మి జిమ్మి' పాట నాకెంతో నచ్చిం అని చెప్పారు. ఆ మాటలు ఎప్పటికీ నాకు గుర్తుంటాయి" అని ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు బప్పి.
ఎంపీగా పోటీచేసి
Bappilahiri political career: రాక్, డిస్కో పాటలే కాదు లతా మంగేష్కర్, ఆశా భోంస్లే, కిషోర్ కుమార్ పాడిన ఎన్నో మధురమైన గీతాలకు ఆయన స్వరాలు అందించారు. హిందీలో ఆయన చివరిసారిగా స్వరాలు అందించి, ఆలపించిన చిత్రం 'భాఘి 3'. 2014లో పశ్చిమబెంగాల్‌లోని శ్రీరాంపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీచేసి ఓడిపోయారు బప్పీ.
పాటల రూపంలో చిరస్మరణీయులు
Bappi lahiri celebrity condolences: అద్భుతమైన సంగీత దర్శకుడు బప్పీలాహిరీ ఆకస్మిక మరణం బాధాకరమని, పాటల రూపంలో ఆయన చిరస్మరణీయులుగా నిలిచిపోతారన్నారు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ట్విటర్ వేదికగా సంతాపం ప్రకటించారు. బప్పీలాహిరీ మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు అన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. హోంమంత్రి అమిత్‌షాతోపాటు పలువురు నేతలు ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు."బప్పీలాహిరీ సంగీతంతో నా సినిమాలకి ప్రేక్షకుల్లో మరింత ప్రాచుర్యం దక్కింది. ఎన్నో పాటలతో ఆయన చిరస్మరణీయులుగా నిలిచిపోతార"ని ట్వీట్ చేశారు చిరంజీవి. తాను నటించిన మూడు సూపర్‌హిట్ గీతాలకి సంగీతం అందించారని, ఆయనతో ఎప్పట్నుంచో అనుబంధం ఉందని మోహన్‌బాబు ట్వీట్ చేశారు. బాలకృష్ణ, పవన్ కల్యాణ్‌తోపాటు, పలువురు తెలుగు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలిపారు.
తెలుగుపాటకు స్వర‘లాహిరీ’
Bappilahiri telugu songs: 1980, 90 దశకాల్లో తన సంగీతంతో తెలుగు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించారు బప్పీలాహిరీ. బాలీవుడ్‌లో డిస్కోకింగ్‌గా పేరు సంపాదించిన బప్పీ... తెలుగు సినిమాల్లోనూ తన శైలి ఊపు తెప్పించే పాటలతోపాటు, మెలోడీల్ని వినిపించారు. తొలి తెలుగు సినిమా ‘సింహాసనం’లోని ‘ఆకాశంలో ఒక తార...’ మొదలుకొని ఆయన స్వరపరిచిన ఎన్నో గీతాలు తరాలు మారుతున్నా వినిపిస్తూనే ఉన్నాయి.
1986లో కృష్ణ కథానాయకుడిగా నటించిన ‘సింహాసనం’తో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు బప్పీ. ఆ తర్వాత వరుసగా కృష్ణ నటించిన ‘తేనె మనసులు, ‘శంఖారావం’ చిత్రాలకి స్వరాలు సమకూర్చారు. 90వ దశకంలో ఆయన జోరు మరింతగా కొనసాగింది. చిరంజీవి కథానాయకుడిగా నటించిన ‘గ్యాంగ్‌లీడర్’, ‘రౌడీ అల్లుడు’, ‘బిగ్‌బాస్’లకు సంగీతమందించి ఉర్రూతలూగించారు.
బాలకృష్ణ ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’, ‘నిప్పు రవ్వ’తోపాటు, మోహన్‌బాబు కథానాయకుడిగా నటించిన ‘రౌడీగారి పెళ్ళాం’, ‘బ్రహ్మ’, ‘పుణ్యభూమి నాదేశం’... ఇలా 25కిపైగా తెలుగు సినిమాలకి ఆయన స్వరాలు సమకూర్చారు.
వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ డాన్స్ డ్యాన్స్..., చుక్కలపల్లకిలో చూపుల అల్లికలో... (స్టేట్‌రౌడీ), ‘డిక్కీ డిక్కీ డీడిక్కీ...’ అంటూ సాగే తన మార్క్ డ్యాన్స్ నంబర్లే కాదు, ముసి ముసి నవ్వులలోన... (బ్రహ్మ) వంటి గుర్తుండిపోయే మెలోడీ పాటల్నీ స్వరపరిచారు. ‘రౌడీ అల్లుడు’ కోసం ఆయన స్వరపరిచిన ‘చిలుకా క్షేమమా’ ఎప్పుడు విన్నా మెప్పించే గీతం.
రీమిక్స్‌తో నేటి తరానికి...
Bappilahiri remix songs: ఆకాశంలో ఒక తార... పాటని 'సీమ టపాకాయ్'లో రీమిక్స్‌గా వినిపించింది. వానా వానా వెల్లువాయె... పాటని ‘రచ్చ’ కోసం మరోసారి రీమిక్స్ చేశారు. అలాగే ‘పటాస్’ చిత్రంలో కోసం అరే ఓ సాంబ.. పాటనూ రీమిక్స్ చేసి నేటి తరాన్ని ఆకట్టుకున్నారు. 1995 తర్వాత తెలుగుకి దూరమైన బప్పీలాహిరీ, 2013లో తన తనయుడు బప్పా లాహిరీతో కలిసి అల్లరి నరేష్ కథానాయకుడిగా నటించిన ‘యాక్షన్ 3డీ’ కోసం స్వరాలు సమకూర్చారు. అందులో రెండు పాటలూ ఆలపించారు. తమన్ స్వరపరిచిన రవితేజ ‘డిస్కోరాజా’లోనూ రమ్ పమ్ బమ్... అనే డిస్కో గీతాన్ని ఆలపించారు బప్పీ.
ఇదీ చూడండి: Bappi Lahiri: బప్పి సంగీతానికి మైకేల్ జాక్సన్ వీరాభిమాని