మాలీవుడ్ స్టార్ మమ్ముట్టి తనకు తానే ఛాలెంజ్ విసురుకున్నారు. లాక్‌డౌన్, కొవిడ్-19 నిబంధనల నేపథ్యంలో వీలైనన్ని రోజులు ఇంట్లోనే గడపాలని దృఢంగా నిశ్చయించుకున్నారు. మార్చి నుంచి తన నివాసాన్ని వదిలి బయటికి రాకపోవడం విశేషం. దాదాపు తొమ్మిది నెలల తర్వాత (275 రోజులు) ఆయన ఇంటి నుంచి అడుగు బయట పెట్టారు. డిసెంబరు 5న సాయంత్రం వేళ స్నేహితులు, దర్శకుడు ఆంటో జోసెఫ్, ప్రొడక్షన్ కంట్రోలర్ బాదుషా, నటుడు రమేశ్‌తో కలిసి సరదాగా బయటికి వెళ్లి ఛాయ్ తాగారు. కలూర్ స్టేడియం వద్ద వీరు ఉండగా తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కొడుకు మెప్పు...
ఈ ఏడాది ఆరంభంలో మమ్ముట్టి తన తర్వాతి సినిమా 'ప్రేయిస్ట్' తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత కేరళలోని కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యారు. మార్చిలో లాక్‌డౌన్ విధించిన తర్వాత కనీసం నిత్యావసర సరకుల కోసమూ ఇల్లు వదిలి బయటికి వెళ్లలేదు. తన తండ్రి మమ్ముట్టి ఇలా దృఢంగా ఉండటాన్ని ఆయన కుమారుడు, హీరో దుల్కర్ సల్మాన్ ప్రశంసించారు. లాక్‌డౌన్‌లో ఆయన తనకు తాను ఛాలెంజ్ విసురుకున్నారని తెలిపారు.
దుల్కర్ ఆగస్టులో విద్యార్థులతో ముచ్చటిస్తూ.. 'మా నాన్న గత 150 రోజులుగా ఇంట్లోనే ఉంటున్నారు. కనీసం కారు తీసుకుని కాసేపు డ్రైవింగ్‌కు వెళ్లమన్నా.. వినలేదు. నాకు మాత్రం ఇంట్లో ఉండి బోర్ కొట్టేసింది. అవకాశం దొరికినప్పుడల్లా బయటికి వచ్చేసేవాడిని..' అని చెప్పారు.
ఫిట్‌నెస్‌పై దృష్టి..
లాక్‌డౌన్ కాలంలో ముమ్ముట్టి తన వ్యాపకాల్లో నిమగ్నం అయ్యారు. రోజూ కసరత్తులు చేస్తూ ఫిట్‌గా మారారు. ఇంట్లో కూర్చునే ఆవరణలోని ప్రకృతిని, పక్షుల్ని కెమెరాలో బంధించారు. తనకు ఇష్టమైన ఫొటోగ్రఫీతో సమయం గడిపే అవకాశం వచ్చిందంటూ ఫొటోలు కూడా షేర్ చేశారు. అంతేకాదు తన గార్డెన్‌లో మొక్కలు నాటి, వ్యవసాయం చేసినట్లు కూడా చెప్పారు.