"ఓ నటిగా నాలోని అన్ని కోణాల్ని తెరపై ఆవిష్కరించాలి. విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పించాలి. ఇవే నా జీవిత లక్ష్యాలు" అంటోంది నటి మిషా నారంగ్. 'తెల్లవారితే గురువారం' చిత్రంతో తెలుగు తెరపైకి అడుగుపెడుతున్న కొత్త అందం ఆమె. శ్రీసింహా కోడూరి హీరోగా నటించాడు. మణికాంత్ జెల్లీ దర్శకుడు. రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని సంయుక్తంగా నిర్మించారు. ఈనెల 27న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించింది మిషా.
- "మా స్వస్థలం హరియాణాలోని కురుక్షేత్ర. పెరిగిందంతా ముంబయిలో. కెమిస్ట్రీలో మాస్టర్స్ చేశా. చిన్నప్పటి నుంచి నటన పట్ల మక్కువ ఉండేది. చాలా ఆడిషన్స్ ఇచ్చా. 'మిస్సింగ్' అనే తెలుగు చిత్రంలో నాయికగా ఎంపికయ్యా. ఆ సినిమా చేస్తున్నప్పుడే.. ఈ చిత్రంలో అవకాశమొచ్చింది. దర్శకుడు చెప్పిన కథ విని.. పాత్ర ప్రేమలో పడిపోయా. అంత మంచి పాత్ర నాది. ఇది నా రెండో చిత్రమైనా.. ప్రేక్షకుల ముందుకొస్తున్న తొలి సినిమా అయింది".
- "పెళ్లి చుట్టూ తిరిగే ఓ ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. నేనిందులో మధు అనే బబ్లీ అమ్మాయిగా కనిపిస్తా. శ్రీసింహతో కలిసి నటించడం ఎంతో సౌకర్యంగా అనిపించింది. చేసే పని పట్ల ఎంతో నిబద్ధతతో ఉంటాడు. చాలా సైలెంట్. నాకు భాష పరంగా చాలా సహాయం చేశారు. 'మిస్సింగ్' చిత్రీకరణ దాదాపు పూర్తయింది. తమిళంలో ఓ సినిమా చేస్తున్నా".
ఇదీ చూడండి: ఏప్రిల్‌లో సేతుపతి 'లాబం'