అగ్ర కథానాయకుడు తారక్ అభిమానులు తనని వేధిస్తున్నారని నటి మీరా చోప్రా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మీరా.. తాజాగా 'ఆస్క్ మీరా' పేరుతో ట్విట్టర్లో అభిమానులతో ముచ్చటించింది. ఇందులో భాగంగా ఓ నెటిజన్ 'ఎన్టీఆర్ గురించి ఏమైనా చెప్పండి?' అని ప్రశ్నించాడు. 'నాకు ఆయన గురించి తెలియదు. ఎందుకంటే నేను ఆయన అభిమానిని కాదు' అని మీరా సమాధానమిచ్చింది. మీరా ఇచ్చిన ఆన్సర్‌కు అసహనానికి గురైన కొందరు నెటిజన్లు ఆమెను అసభ్యపదజాలంతో దూషిస్తూ ట్వీట్లు పెట్టారు. అంతేకాకుండా ఆన్‌లైన్ వేదికగా బెదిరింపులకు పాల్పడ్డారు.
నెటిజన్ల ట్వీట్లతో ఆవేదనకు గురైన మీరా ట్విటర్ వేదికగా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కొందరు నెటిజన్లు తనని వేధిస్తున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అసభ్యపదజాలంతో దూషిస్తూ పలువురు చేసిన ట్వీట్లను స్క్రీన్షాట్లను తీసి పోలీసులకు షేర్ చేశారు.
"హైదరాబాద్ సిటీ పోలీస్, సైబర్‌క్రైమ్ పోలీసులకు .. ఈ ట్విటర్ ఖాతాదారులందరిపై ఫిర్యాదు చేస్తున్నాను. వీళ్లందరూ గ్యాంగ్‌రేప్, చంపేస్తామంటూ నన్ను బెదిరిస్తున్నారు. దురదృష్టకరం ఏమిటంటే వీళ్లందరూ ఎన్టీఆర్ అభిమానులు. ట్విటర్.. మీరు కూడా ఈ ట్వీట్లను ఒక్కసారి గమనించి, వెంటనే సదరు అకౌంట్లను తొలగించాలని కోరుకుంటున్నాను" అని మీరా ట్వీట్ చేశారు.
అనంతరం ఆమె ఎన్టీఆర్‌కి కూడా ట్వీట్ చేశారు. "ఎన్టీఆర్.. మీకంటే ఎక్కువగా మహేశ్ బాబుని అభిమానిస్తున్నానని చెప్పినందుకు మీ అభిమానులు నన్ను వేధిస్తున్నారు. ఇలాంటి అభిమానులు ఉంటే విజయం వరిస్తుందని మీరు భావిస్తున్నారా?" అని మీరా ప్రశ్నించారు.