ఎస్పీ బాలు అత్యద్భుత ప్రతిభకు తగ్గట్టే.. లెక్కలేనన్ని పురస్కారాలు ఆయన్ని వరించాయి. కేంద్రం తాజాగా ఆయనికి పద్మ విభూషణ్ అవార్డు అందించిన తరుణంలో బాలు అందుకున్న ఇతర పురస్కారాలను ఓసారి గుర్తుచేసుకుందాం..
పాటలకు ప్రాణం పోసిన బాలు.. సంగీత ప్రయాణంలో 6 జాతీయ పురస్కారాలు గెలిచారు. అలాగే తెలుగునాట ఏకంగా 25నంది అవార్డులతో భళా అనిపించారు. తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాల నుంచీ అనేక పురస్కారాలూ అందుకున్నారు. హిందీ పాటకు గానూ ఓసారి, దక్షిణభారత పాటలకు ఆరు పర్యాయాలు ఫిల్మ్ ఫేర్ సాధించారు. ఇప్పుడు ఆయనను కేంద్రప్రభుత్వం పద్మవిభూషణ్(మరణాంతరం) అవార్డుతో గౌరవించింది.
మరెన్నో అవార్డులు
2012 సంవత్సరానికి గాను ఎన్టీఆర్ జాతీయ పురస్కారం ఎస్పీబీని వరించింది. భారతీయ చిత్ర పరిశ్రమకు అందించిన సేవలకు గుర్తింపుగా... 2016లో సిల్వర్ పీకాక్ మెడల్ వచ్చింది. ఇక భారత ప్రభుత్వ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మశ్రీని 2001లోనూ, పద్మభూషణ్ అవార్డును 2011లోనూ అందుకున్నారు.
ఆయన కంఠస్వరంలో రసవాహిని ఉప్పొంగుతోంది.. మాధుర్యం అంబరాన్ని తాకుతుంది. ఆయన సంగీతం ఖండాంతరాల్లో ఉండే భారతీయ సంతతిని సైతం ఉత్తేజింపజేస్తోంది. ఆయనే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. తన మధురమైన గాత్రంతో ఏళ్లుగా అలరిస్తున్న ఆయన.. కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించారు. వాటి గురించి ఓసారి తెలుసుకుందాం.