బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్‌ఖాన్ నటిస్తోన్న కొత్త చిత్రం 'లాల్‌సింగ్ చద్దా' షూటింగ్ తుదిదశకు చేరుకుంది. లద్దాఖ్, కార్గిల్ ప్రాంతాల్లో ఈ సినిమాకు సంబంధించిన ఆఖరి షెడ్యూల్‌ను వచ్చే నెలలో ప్రారంభించనున్నారు.
మే, జూన్ నెలల్లో కార్గిల్ వార్‌కు సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. సినిమాలో ఇదే కీలకమైన ఎపిసోడ్ అని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. షూటింగ్ చేసేందుకు అనువైన ప్రాంతం కోసం చిత్రబృందం వెతుకులాటలో పడినట్లు తెలుస్తోంది.

45 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్లో యాక్షన్ సన్నివేశాలను రూపొందించనున్నారు. అయితే ఇదే షెడ్యూల్లో అక్కినేని వారసుడు నాగచైతన్య చిత్రీకరణలో అడుగుపెట్టనున్నాడని తెలుస్తోంది. బాలీవుడ్లో చైతూ నటించనున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం.

1994లో విడుదలైన 'ఫారెస్ట్ గంప్' హాలీవుడ్ సినిమాకు హిందీ రీమేక్ ఇది. ఇందులో ఆమిర్‌ఖాన్ సరసన కరీనా కపూర్ నాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి అద్వైత్ చందన్ దర్శకత్వాన్ని వహిస్తున్నారు. క్రిస్మస్కు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం ఇదివరకే ప్రకటించింది.

ఇదీ చూడండి: అణు శాస్త్రవేత్త బయోపిక్‌లో సైఫ్!