'పలాస' చిత్రంతో సినీప్రియులతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నారు దర్శకుడు కరుణ కుమార్. తొలి ప్రయత్నంలోనే మెప్పించిన ఈ దర్శకుడితో ఓ సినిమా చేసేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఇప్పటికే ఆయనకు అడ్వాన్స్ కూడా ముట్టజెప్పేసింది. ఇప్పుడీ నిర్మాణ సంస్థలో ఆయన ఏ కథానాయకుడితో సినిమా చేయనున్నారనేది అందరిలోనూ ఆసక్తిరేకెత్తిస్తోంది.
ప్రస్తుతం కరుణతో సినిమా చేసేందుకు సీనియర్ హీరో రాజశేఖర్‌తో పాటు యువ కథానాయకుడు సుధీర్‌బాబు సిద్ధంగా ఉన్నారు. వీరిలో సుధీర్‌కు ఇప్పటికే కథ చెప్పడం జరిగిందని, అదొక థ్రిలర్ కథాంశంతో రూపొందబోతుందని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ అంశాలన్నింటి క్లారిటీ ఇచ్చారీ దర్శకుడు.
"నా దగ్గర 14 స్క్రిప్ట్‌లు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో ఆరు బన్ని వాసుకు చెప్పా. వాటిలో ఏదొకటి తమ బ్యానర్‌లో తెరకెక్కిద్దామన్నారు. ఇక రాజశేఖర్ ఫ్యామిలీ కూడా ఓ మలయాళ రీమేక్ చేద్దామన్నారు. ఇంకా ఆ చిత్ర హక్కులైతే తీసుకోలేదు. నేనైతే సుధీర్‌కు ఓ కథ చెప్పడం వాస్తవం. థ్రిల్లర్ కథాంశమది. బ్యాంక్ దోపిడీ కథాంశంతో అల్లుకున్న కథ అన్నది అవాస్తవం. కథలో ఆ పాయింట్ టచ్ అవుతుంది తప్ప అదే నేపథ్యంతో సాగదు. అందులో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. కథ వినగానే సుధీర్ చేద్దామన్నారు. కానీ, ఇది ఏ నిర్మాణ సంస్థలో ఉండనుందన్నది తెలియదు. లాక్‌డౌన్ పరిస్థితుల కారణంగా ఈ ప్రాజెక్టులపై అందరితో మాట్లాడే అవకాశం రాలేదు. కాబట్టి తర్వాతి సినిమా ఎవరితో ఉండనుంది, ఏ బ్యానర్‌లో చేస్తామన్నది ఇప్పుడే కచ్చితంగా చెప్పలేం. ఈ ప్రాజెక్టులన్నింటిపైనా స్పష్టత రావాలంటే కొంత కాలం వేచి చూడక తప్పదు."
-కరుణ కుమార్, దర్శకుడు
లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగ్‌లు వాయిదాపడ్డాయి. ఈ సమయంలో కొత్త కథలు సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు దర్శకులు.