అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. రహస్యంగా ఆమె నిశ్చితార్థం జరిగిందని ఇటీవల వార్తలొచ్చాయి. అయితే వీటిని కాజల్ ఖండించలేదు, దానిపై స్పందించలేదు. కాగా ఇప్పుడు ఆమెకు కాబోయే భర్త ఇతనే అంటూ ఫొటోలు వైరల్‌గా మారాయి. ముంబయికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును కాజల్ పెళ్లాడనున్నట్లు సమాచారం.

గౌతమ్.. కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్‌లో చదువుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత టఫ్ట్స్ యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించారట. డిసెర్న్ లివింగ్ అనే ఇంటీరియర్ డిజైనింగ్ సంస్థను స్థాపించి, నడుపుతున్నారు. ముంబయిలోని ఓ హోటల్‌లో వీరి వివాహ వేడుక నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. రెండు రోజులపాటు జరగనున్న ఈ శుభకార్యానికి కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరు కాబోతున్నారట. జోరుగా సాగుతున్న పెళ్లి ప్రచారంపై కాజల్ ఇప్పటి వరకు స్పందించలేదు. కాగా ఆమె గౌతమ్ కిచ్లు ఇన్‌స్టాగ్రామ్ ఫొటోలను లైక్ చేయడం, వాటికి కామెంట్ చేయడం గమనార్హం.

ప్రముఖ కథానాయకుడు కమల్ హాసన్-దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న 'భారతీయుడు 2'లో కాజల్ కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. అదేవిధంగా దుల్కర్ సల్మాన్, అదితిరావు హైదరి జంటగా నటిస్తున్న సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. మంచు విష్ణుతో కలిసి 'మోసగాళ్లు' సినిమా కోసం పనిచేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన లభించింది.
