స్కాటిష్ నటుడు, జేమ్స్‌బాండ్ తొలి పాత్రధారి సర్ థామస్ సీన్ కానరీ(90) కన్నుమూశారు. నటుడిగా, నిర్మాతగా చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేసిన ఆయన.. ఆస్కార్ పురస్కారం సహా ఎన్నో అవార్డులను అందుకున్నారు. ఈ ఏడాది ఆగస్టులో 90వ పుట్టిన రోజు జరుపుకున్న సీన్.. మూడు నెలలు తిరగకుండానే మరణించడం వల్ల హాలీవుడ్ పరిశ్రమ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు విచారంలో మునిగిపోయారు.
భాషతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా అశేష అభిమానులు కలిగిన పాత్ర జేమ్స్ బాండ్. 'బాండ్.. జేమ్స్ బాండ్' అంటూ తొలిసారి ఆ పాత్రలో కథానాయకుడిగా నటించి మెప్పించారు సీన్ కానరీ. మొత్తం ఆరు చిత్రాల్లో జేమ్స్ బాండ్‌గా దర్శనమిచ్చారు. ‘డాక్టర్ నో’, ‘ఫ్రమ్ రష్యా విత్ లవ్’, ‘గోల్డ్ ఫింగర్’, ‘థండర్ బాల్’, ‘యు ఓన్లీ లివ్ ట్వైస్’, ‘డైమండ్స్ ఆర్ ఫరెవర్’ సినిమాలతోనూ మెప్పించారు. ‘ది అన్ టచ్‌బుల్స్’ చిత్రంలో నటనకు గాను ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్ అవార్డు అందుకున్నారు.
1989 సంవత్సరంలో పీపుల్ మ్యాగజైన్ ఆయనను ‘సెక్సియస్ట్ మ్యాన్ ఎలైవ్’గా, 1999లో ‘సెక్సియస్ట్ మ్యాన్ ఆఫ్ ది సెంచరీ’గా ప్రశంసించింది. 2006లో అమెరికన్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నుంచి జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న సీన్ కానరీ ఆ తర్వాత నట జీవితం నుంచి విశ్రాంతి తీసుకున్నారు. అయితే, 2012లో ‘సర్ బిల్లీ’ చిత్రానికి వాయిస్ ఓవర్ అందించారు.