కన్నడ చిత్రపరిశ్రమకు సంబంధించిన డ్రగ్స్ కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొని గతేడాది జైలుకెళ్లిన నటి సంజనా గల్రానీ. ఈ ఏడాది ఆరంభంలో బెయిల్‌పై బయటకు వచ్చిన ఆమె ఇటీవల కరోనా బారిన పడ్డారు.
జీవితంలో వెంట వెంటనే ఇలాంటి చేదు సంఘటనలు ఎదుర్కోవడం ఎంతో బాధాకరంగా ఉందని తాజాగా సంజన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతేకాకుండా బెయిల్‌పై బయటకు వచ్చిన వెంటనే తన ప్రియుడితో కలిసి వివాహబంధంలోకి అడుగుపెట్టడంపై స్పందించారు.
"వ్యక్తిగతంగా, వృత్తిపరంగా గతేడాది నేను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. బెయిల్‌పై బయటకు వచ్చిన వెంటనే ఈ నూతన సంవత్సరంలో జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలని ఆశించాను. ఇంతలో నేను కరోనా బారిన పడ్డాను. త్వరలోనే నేను దీని నుంచి కోలుకుంటానని ఆశిస్తున్నాను. అజీజ్ పాషాతో ఇటీవల నేను ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. వృత్తిరీత్యా అతను వైద్యుడు. బెంగళూరులోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. మేమిద్దరం చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులం. అలా మా స్నేహం కొంతకాలానికి ప్రేమకు దారి తీసింది. డేటింగ్‌లో కూడా ఉన్నాం. కాకపోతే, మా ప్రేమ విషయాన్ని ఎవ్వరికీ చెప్పలేదు. చాలా రహస్యంగా ఉంచాం. గతేడాది నేను ఓ కేసులో జైలుకు వెళ్లినప్పుడు సైతం పాషా, అతని కుటుంబం నాకెంతో అండగా నిలిచింది. బెయిల్‌పై బయటకు రాగానే మా ఇరువురి కుటుంబసభ్యులు మాకు పెళ్లి చేసేయాలని నిర్ణయించుకున్నారు. అలా అతి తక్కువ మంది కుటుంబసభ్యుల సమక్షంలో మా వివాహం జరిగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తను నిత్యం ఆస్పత్రికి వెళ్లి.. కొవిడ్ బాధితులకు చికిత్స అందించి వస్తున్నాడు. ఏదో ఒకరోజు తప్పకుండా మేము కూడా కరోనా బారిన పడే అవకాశాలున్నాయని ముందే ఊహించాం. నా దిగులంతా అతని ఆరోగ్యం గురించే. ఇప్పుడు నేను కొద్దిగా ఆరోగ్యంగానే ఉన్నాను" అని సంజనా గల్రానీ వెల్లడించారు.
ఇదీ చూడండి : అప్పుడు 'సుల్తాన్'.. ఇప్పుడు 'సర్దార్'గా కార్తి