బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌కు(Hrithik Roshan) తొలిసారి సినిమా అవకాశం తన వల్లే వచ్చిందని ప్రముఖ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ డబూ రత్నానీ(Daboo Ratnani) అన్నారు. త్వరలో సినీ ప్రముఖుల ఫొటోలతో ప్రచురితమయ్యే 'డబూ రత్నాని 2021 క్యాలెండర్'ను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డబూ ఈ విషయాన్ని వెల్లడించారు.
"'కహోనా ప్యార్ హై' సినిమా ముందు నేను అతడి తొలి పోర్ట్‌ఫోలియో షూట్ చేశాను. నా వల్లే అతడికి సినిమా అవకాశం వచ్చింది. హృతిక్, ఈ విషయం నాతో చెప్పారు. అంతకుముందు అతడి నాన్న రాకేష్ రోషన్ నాకు కాల్ చేశారు. 'మీ ఫొటోలను చూశాను. నా కొడుకుతో సినిమా చేయాలనుకుంటున్నాను' అని నాతో అన్నారు. ఎప్పుడు ప్రజలతో నిజాయతీగా ఉండాలని చెప్పారు"
-డబూ రత్నానీ, ఫొటోగ్రాఫర్
హృతిక్ రోషన్.. 2000లో 'కహోనా ప్యార్ హై'(Kaho Naa pyar hai) సినిమాతో హీరోగా అరంగేట్రం చేశారు. ఈ సినిమాకు ఏకంగా 102 అవార్డులు వచ్చాయి. అన్ని పురస్కారాలు లభించడమే కాకుండా బాక్సాఫీసు వద్ద అప్పట్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత పలు హిట్ సినిమాలు చేశారు హృతిక్. క్రిష్ సిరీస్.. సూపర్‌హీరోగా ఆయనకు గుర్తింపు తీసుకొచ్చింది. చివరిసారిగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో 'వార్' సినిమాతో ప్రేక్షకుల ముందుక వచ్చారు. మళ్లీ అదే దర్శకుడితో 'ఫైటర్' సినిమా చేయనున్నారు. 'క్రిష్ 4' సినిమాను తెరకెక్కించనున్నట్లు బుధవారం అధికారికంగా ప్రకటించారు.
డబూ రత్నానీ ఓ ప్రముఖ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్. ప్రతి ఏటా సినీ ప్రముఖుల ఫొటోలతో ఓ క్యాలెండర్ రూపొందించి, ప్రచురితం చేస్తుంటారు. ఈ ఏడాది.. ఆలియా భట్, సన్నీలియోని, కియారా అడ్వాణీ, సైఫ్ అలీఖాన్ సహా పలువురు నటులతో ఫొటోషూట్ చేశారు. ఇందులో విజయ దేవరకొండ కూడా ఉండటం విశేషం.
ఇదీ చూడండి: ఒక్క సినిమాకు వందకు పైగా పురస్కారాలు!