తమ అభిమాన కథానాయకుడు తర్వాతి చిత్రాన్ని ఎవరి దర్శకత్వంలో చేస్తున్నాడా? అన్న ఆసక్తి ప్రతి ప్రేక్షకుడికీ ఉంటుంది. కొత్త దర్శకుడైతే పెద్దగా అంచనాలు ఉండవు. అదే అప్పటికే ఒకట్రెండుసార్లు పనిచేసి, హిట్ కొట్టిన దర్శకుడైతే ఆ క్రేజ్ మరో స్థాయిలో ఉంటుంది. అలా బాక్సాఫీసు వద్ద సందడి సృష్టించిన హిట్టు జోడీలు మళ్లీ చేతులు కలిపాయి. ఈ సారి కూడా ప్రేక్షకుల్ని అలరించే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే విజయాలు అందుకున్న కాంబినేషన్లు కావడం వల్ల అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదల చేసిన కొన్ని ప్రచార చిత్రాలు కూడా ఆకట్టుకుంటున్నాయి. త్వరలో వెండితెరపైకి రాబోతున్న ఆ క్రేజీ కాంబినేషన్‌లు ఏంటో చూద్దామా!
నీరు.. నిప్పు.. కలిస్తే..!
ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నెం.1, సింహాద్రి, యమదొంగ.. సినిమాలు తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగా అలరించాయే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కో చిత్రం ఒక్కో రీతిలో వినోదం పంచింది. రామ్ చరణ్ హీరోగా చేసిన ‘మగధీర’ అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. ఇప్పుడు ఈ సినిమాల్ని తీసిన రాజమౌళి, కథానాయకులు తారక్, చరణ్ కాంబినేషన్‌లో ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా రూపొందుతోంది. సాధారణంగానే రాజమౌళి సినిమా అంటే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉంటాయి. ఇప్పుడు ఆయనతో ఇద్దరు స్టార్ హీరోలు తోడవ్వడంతో ప్రత్యేకత సంతరించుకుంది. ‘బాహుబలి’ వంటి ప్రతిష్ఠాత్మక చిత్రం తర్వాత జక్కన్న రూపొందిస్తున్న ఈ సినిమాను దానయ్య నిర్మిస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీమ్‌గా తారక్ నటిస్తుండంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. 2021 జనవరి 8న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన చరణ్ ‘భీమ్ ఫర్ రామరాజు’ టీజర్ విశేషంగా ఆకట్టుకుంది.
వైలెన్స్ చూపిస్తానంటున్న నాని
అష్టా చమ్మా, జెంటిల్‌మెన్‌తో క్రేజీ కాంబినేషన్ అనిపించుకున్నారు ఇంద్రగంటి మోహనకృష్ణ-నాని. వీరిద్దరూ మరోసారి ‘వి’తో హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అవుతున్నారు. ఇందులో నాని ప్రతినాయకుడి ఛాయలున్న పాత్రలో నటించినట్లు ఇప్పటివరకు వచ్చిన ప్రచార చిత్రాల్ని బట్టి తెలుస్తోంది. నివేదా థామస్, అదితిరావు హైదరి కథానాయికలుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. నిజానికి మార్చి 25న ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. కానీ కరోనా వైరస్ సంక్షోభం వల్ల విడుదల వాయిదా పడింది. కొత్త తేదీని ప్రకటించాల్సి ఉంది.
బాలయ్యతో ట్రిపుల్ ధమాకా
బోయపాటి శ్రీను- నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ సూపర్‌హిట్ అనే మార్క్ ఏర్పడిపోయింది. ఇప్పటికే వీరిద్దరి కలయికలో సింహా, లెజెండ్’ సినిమాలు వచ్చాయి. ఈ రెండూ మంచి విజయం సాధించాయి. ఇప్పుడు వీరిద్దరు కలిసి మూడో సినిమా కోసం పనిచేస్తున్నారు. బాలకృష్ణ 106 సినిమాను బోయపాటి తెరకెక్కిస్తున్నారు. భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో బోయపాటి-బాలయ్య హ్యాట్రిక్ కచ్చితమని అభిప్రాయపడుతున్నారు. కరోనా కారణంగా ప్రస్తుతం షూటింగ్ వాయిదా పడింది. శ్రియ, భూమిక కీలక పాత్రలు పోషించబోతున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నట్లు తెలిసింది.
యోవ్ మూడోసారి సిద్ధంగా ఉండారా?
ఆర్య, గీత, అజయ్.. ఈ మూడు పేర్లు చెప్పగానే గుర్తొచ్చే వ్యక్తులు అల్లు అర్జున్, సుకుమార్. ‘ఆర్య’, ‘ఆర్య 2’ సినిమాలతో వీరిద్దరూ క్రేజీ కాంబినేషన్ అనిపించుకున్నారు. ఇప్పుడు దాదాపు 11 ఏళ్ల తర్వాత బన్నీ, సుకుమార్ ‘పుష్ప’ సినిమా కోసం పనిచేస్తున్నారు. ఈసారి కొత్త సబ్జెక్ట్‌ను ఎంచుకున్నారు. శేషాచలం అడవులు, ఎర్రచందనం దొంగల నేపథ్యంలో తీస్తున్న సినిమా ఇది. ఈ సినిమా కోసం బన్నీ, కథానాయిక రష్మిక చిత్తూరు యాస నేర్చుకుంటున్నారట. విభిన్న కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించబోతున్నట్లు తెలిసింది. దీంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. దీనికి తోడు ఇటీవల వచ్చిన ఫస్ట్‌లుక్ అంచనాల్ని మరింత పెంచింది.
ఈసారి గబ్బర్ తిక్కకు లెక్కేంటో..!
పవన్ కల్యాణ్-హరీష్ శంకర్ మరోసారి సినీ ప్రియుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్‌లో రెండో సినిమా రాబోతోంది. ఇది పవన్ 28వ చిత్రంగా రూపొందనుంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ‘గబ్బర్ సింగ్’ వంటి హిట్ తర్వాత హరీష్-పవన్‌ల కలయికలో రానున్న చిత్రం కావడంతో దీనిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. హరీష్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు.
రామ్‌ని రఫ్‌గా..
రామ్ కెరీర్‌లో మంచి హిట్లుగా నిలిచిన సినిమాలు ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’. వీటికి కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు. ఇప్పుడు మళ్లీ రామ్-కిశోర్ కాంబినేషన్‌లో ‘రెడ్’ సినిమా రూపొందింది. ఏప్రిల్ ఆరంభంలో ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ, లాక్‌డౌన్ నేపథ్యంలో వాయిదా పడింది. కొత్త విడుదల తేదీని ప్రకటించాల్సి ఉంది. ఈ సినిమాలో రామ్ రెండు విభిన్నమైన పాత్రల్లో నటించిట్లు సమాచారం. నివేదా పేతురాజ్, అమృత అయ్యర్, మాళవికా శర్మ కథానాయికలు. ఇప్పటికే వచ్చిన ఈ చిత్రం ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది.
పెద్దోడిని నారప్పగా..
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి మల్టీస్టారర్ చిత్రం తీసి, ఘన విజయాన్ని అందుకున్నారు శ్రీకాంత్ అడ్డాల. ఆ చిత్రంలో అగ్ర కథానాయకుడు వెంకటేశ్‌ను పెద్దోడిగా చూపించి అలరించారు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘నారప్ప’. తమిళ హిట్ ‘అసురన్’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. దీంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. కరోనా కారణంగా ఈ సినిమా చిత్రీకరణ తాత్కాలికంగా వాయిదా పడింది. ఇప్పటికే విడుదల చేసిన వెంకటేశ్ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
ఇదీ చూడండి : దేశవాళీ లీగ్‌తో రీఎంట్రీ ఇవ్వనున్న ధోనీ!