Rana Bheemlanayak: "మాస్ సినిమా చేయాలని అందరూ చెబుతుంటే.. ఎందుకా? అనుకునేవాణ్ని. మాస్... కమర్షియల్ సినిమా అంటే ఇన్నేళ్ల తర్వాత ‘భీమ్లానాయక్’తో అర్థమైంది. ఇకపై ఈ తరహా ప్రయత్నాలు నేనూ చేస్తా" అన్నారు ప్రముఖ హీరో రానా దగ్గుబాటి. ఆయన పవన్‌కల్యాణ్‌తో కలిసి నటించిన చిత్రం ‘భీమ్లా నాయక్’. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ప్రయాణం గురించి రానా చెప్పిన విశేషాలేంటో చూద్దాం.
"ఈ సినిమా తర్వాత నాతో చాలా మంది చాలా అభిప్రాయాలు వ్యక్తం చేశారు కానీ.. అందులో మా నాన్న చెప్పిన మాట నాకు బాగా గుర్తుండిపోతుంది. నాన్న ఏదైనా ఎక్కువగా చెప్పరు. ‘సంతృప్తి చెందా’ అన్నారు. ‘బాహుబలి’ తర్వాత మళ్లీ ఈ సినిమాకే చాలా గొప్పగా చెప్పారనిపించింది. తెలుగు పరిశ్రమలోనే ఫిల్మ్ మేకింగ్ చేస్తారని ఓ పంపిణీదారుడు ‘వకీల్‌సాబ్’ సమయంలో చెప్పారు. అలాంటి విషయాలన్నిటిపైనా నాలో అవగాహన పెంచింది ‘భీమ్లానాయక్’. రెండేళ్లపాటు ఏ సినిమా చేయకుండా గడిపిన నేను ‘విరాటపర్వం’ ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్ కోసం చిన్నాన్న వెంకటేష్‌తో కలిసి 8 గంటల వెబ్ సిరీస్, ‘భీమ్లానాయక్’... ఇలా బోలెడంత పనిచేసినట్టు అనిపించింది. ‘విరాటపర్వం’ విడుదలకి సిద్ధమవుతోంది. ఈ పనులన్నీ పూర్తయ్యాక కొత్త సినిమాలపై నిర్ణయం తీసుకుంటా".
- " class="align-text-top noRightClick twitterSection" data="">
"ఏం చేసినా కొత్తగా ఉండాలనుకునే తత్వం నాది. ఇప్పటిదాకా చూడనిది తెరపై చూడాలనే ఆలోచనతోనే నేను థియేటర్‌కి వెళుతుంటా. అంతకంటే కొత్తగా నేనేం చేయగలననే ఆలోచనతోనే ఉంటా. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చూశాక ఇది నా జోన్ సినిమానే అనిపించింది. ఇద్దరి వ్యక్తుల మధ్య ఒకే అంశం మీద నడిచే కథ ఇది. తెలుగులో రీమేక్ చేస్తున్నారన్నప్పుడు, అదీ పవన్‌కల్యాణ్‌లాంటి ఓ పెద్ద స్టార్ వచ్చి ఇలాంటి జోనర్ ప్రయత్నిస్తున్నారని తెలిసినప్పుడు చాలా ఆత్రుతగా అనిపించింది. అవకాశం నా దగ్గరకి రాగానే డానీ పాత్రకి ఎవర్నీ అనుకోకపోతే నేనే చేస్తానని చెప్పా. ‘ఐరన్ మేన్’ సినిమాలో రాబర్ట్ డౌనీ పాత్రంటే నాకు చాలా ఇష్టం. అందులో ఆ పాత్ర నచ్చని పనులన్నీ చేస్తుంటుంది, కానీ అవి మనకు బాగా నచ్చుతుంటాయి. ఆ పాత్రకీ, డానీ పాత్రకీ పోలికలు కనిపించాయి. ఒక సినిమాని రీమేక్ చేస్తున్నప్పుడు దాని వెనక చాలా వ్యవహారాలు ఉంటాయి. మా చిన్నాన్న వెంకటేష్ చాలా రీమేక్‌లు చేశారు. మార్పులు, చేర్పుల విషయంలో ఎలా మాట్లాడుకుంటుంటారో నేను వినేవాణ్ని. మాతృకలో ఉన్న భావోద్వేగాలు ఏమాత్రం పోకుండా మన వాళ్లకి నచ్చేలా ఈ సినిమాని రచించారు. కొన్ని సన్నివేశాల్ని ఒరిజినల్‌ని మరిచిపోయేంతగా రాశారు. దానికి తగ్గట్టే దర్శకుడు సాగర్ కె. చంద్ర తెరకెక్కించారు".
"కేరళ సంస్కృతితో పోలిస్తే మన భాష, మన అభిరుచులకి చాలా వ్యత్యాసం ఉంటుంది. అక్కడ ఒక చిన్న విషయాన్ని చాలా సుదీర్ఘమైన మాటలతో చెబుతున్నట్టు అనిపిస్తుంది. మనం ఒకట్రెండు మాటలతో ఆ భావాల్ని చెప్పేస్తుంటాం. మూడు గంటలు నిడివి ఉన్న ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాని మన నేపథ్యానికి తగ్గట్టుగా మార్చిన విధానం చాలా బాగుంది. ప్రతి సినిమా నుంచీ నేను ఎంతో కొంత నేర్చుకుంటా. త్రివిక్రమ్ నుంచి చాలా నేర్చుకున్నా. పవన్ కల్యాణ్‌తో ఈ సినిమాకి ముందు పెద్దగా పరిచయం లేదు, ఆయన్ని కలిసిందీ తక్కువే. సెట్‌కి వెళ్లాక మరో కొత్త పవన్‌కల్యాణ్ కనిపించారు. ఆయన చెప్పే ప్రతీ మాట నిజాయతీగా ఉంటుంది. ఈ సినిమా ప్రయాణంలో నేను ఆయనతో బాగా కలిసిపోయా".
- రానా దగ్గుబాటి, ప్రముఖ హీరో
ఇదీ చదవండి: 'కేజీఎఫ్-2' నుంచి సూపర్ అప్డేట్.. కమల్ 'విక్రమ్' షూటింగ్ పూర్తి