టాలీవుడ్ హీరో మంచు మనోజ్.. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత 'అహం బ్రహ్మస్మి'లో నటించేందుకు సిద్ధమయ్యాడు. ఇటీవలే లాంఛనంగా ప్రారంభించారు. అయితే మార్చి 12 నుంచి షూటింగ్ మొదలుపెట్టాలనుకున్న వీరి ఆలోచనలపై కరోనా నీళ్లు చల్లింది. అయినా సరే, ఈ ఆదివారం తమ సినిమా నుంచి తొలిపాటను విడుదల చేయనున్నట్లు చెప్పాడు మనోజ్. అందుకు సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
"మూడు సంవత్సరాల విరామం తర్వాత మంచి సినిమాతో మిమ్మల్ని పలకరిద్దాం అనుకున్నాను. మనమంతా ఒక స్క్రిప్ట్ రాసుకుంటే దేవుడు మరొక స్క్రిప్ట్ రాస్తాడు. "యాక్షన్" అన్న పదం వినే అదృష్టాన్ని ఇంకొన్ని రోజులు దూరం జరిపాడు. ఈ ఆదివారం.. డాక్టర్లకు, పోలీసులకు, ఆర్మీకి, పారిశుధ్య కార్మికులకు, ముఖ్యంగా వాళ్ళు చేసే త్యాగానికి ఒక పాట అంకితం చేస్తున్నాను. అచ్చు మ్యూజిక్ డైరెక్షన్లో 'అంతా బాగుంటాం రా' అని నేను, నా మేనకొడలు విద్య నిర్వాణ కలిసి పాడి, పాట రూపంలో ఇస్తున్న చిన్న భరోసా ఇది" -కథానాయకుడు మంచు మనోజ్ పోస్ట్
ఈ సినిమాలో కన్నడ మోడల్ ప్రియా భవానీ శంకర్ హీరోయిన్. తనికెళ్ల భరణి, మురళీశర్మ, సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీకాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. పాన్ ఇండియా కథతో తెరకెక్కిస్తున్నారు.