ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ ఎడిటర్ అజయ్ శర్మ(30) కన్నుమూశారు. గత కొన్ని రోజులు కొవిడ్ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే బుధవారం దిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అజయ్ తుదిశ్వాస విడిచారు.
బాలీవుడ్లో రూపొందిన 'లూడో', 'జగ్గ జాసూస్' వంటి సినిమాలకు అజయ్ ఎడిటర్‌గా పనిచేశారు. ఆయన వయసు 30 ఏళ్లు. ఆయనకు భార్య, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. 'బర్ఫీ', 'కై పో చే', 'యే జవానీ హై దీవానీ', 'అగ్నిఫథ్', 'మెట్రో', 'డర్టీ పిక్చర్' వంటి చిత్రాలకు అసోసియేట్ ఎడిటర్‌గా పనిచేశారు. దివంగత బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ నటించిన 'కార్వాన్'తో పాటు వెబ్ సిరీస్ చిత్రం 'బందీష్ బండిట్స్'కు పనిచేశారు.
అజయ్ మృతి పట్ల బాలీవుడ్ చిత్రసీమకు చెందిన పలువురు నటీనటులు, ప్రముఖులు తమ సంతాప సానుభూతిని సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ఆయన తాప్సీ కథానాయికగా క్రీడా నేపథ్యంగా తెరకెక్కుతున్న 'రష్మీ రాకెట్' చిత్రానికి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.
ఇదీ చూడండి: కరోనా తీవ్రతపై కోలీవుడ్ ప్రముఖులు ఏమన్నారంటే!