కరోనా దెబ్బకు సినీ క్యాలెండర్ మొత్తం తారుమారైపోయింది. వేల కోట్ల రూపాయల ఆదాయం ఆవిరైపోయింది. ఇప్పటికే వేసవి సీజన్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా.. దసరా సీజన్‌పైనా నీలి నీడలు కమ్ముకునే ఉన్నాయి. ఓవైపు అగ్ర దర్శకులు రాజమౌళి, తేజ లాంటి సినీప్రముఖులు ఒకొక్కరిగా కరోనా బారిన పడటం వల్ల.. చిత్రీకరణలకు బయటకు అడుగుపెట్టాలన్నా భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు థియేటర్లు తెరచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు దక్కినా.. వాళ్లిచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఎంతమంది సిద్ధపడతారన్నది తెలియాల్సి ఉంది. ముఖ్యంగా భారీ, మధ్యస్థాయి బడ్జెట్ చిత్రాల్ని థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు నిర్మాతలు వెనకడుగే వేసే అవకాశాలున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే గతేడాది తెరపై దర్శించుకోలేకపోయిన కొందరు అగ్ర హీరోల్ని.. ఈ ఏడాదీ తెరపై చూసుకునే వీలు చిక్కకపోవచ్చు. మరి గత సంక్రాంతి తర్వాత నుంచి ఇప్పటి వరకు తెరపై సందడి చెయ్యని ఆ కథానాయకులపై ఓ లుక్కేద్దామా.
మూడేళ్ల నిరీక్షణ...
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌ను అభిమానులు తెరపై చూసుకోని రెండున్నరేళ్లు దాటింది. ఆయన చివరిసారిగా 2018 సంక్రాంతికి 'అజ్ఞాతవాసి' చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించారు. త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాన్ని దక్కించుకున్నప్పటికీ చక్కటి వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత పవన్ జనసేన పార్టీ స్థాపించడం, పూర్తి స్థాయిలో రాజకీయాలకే పరిమితం కావడం వల్ల సినీప్రియులకు ఆయన వినోదాలు దూరమయ్యాయి. కానీ, అనూహ్యంగా ఈ ఏడాది ఆయన వెండితెరపైకి రీఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించడం.. వెంట వెంటనే మూడు చిత్రాలకు పచ్చజెండా ఊపడం వల్ల అభిమానుల్లో జోష్ వచ్చింది. నిజానికి అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాదిలో ఆయన్ని రెండు చిత్రాల్లో చూసే వీలు దక్కేది. కానీ, కరోనా పరిస్థితులతో ఆయన దర్శన భాగ్యం మరింత ఆలస్యం కాబోతుంది. ఇప్పటికే ఆయన రీఎంట్రీ చిత్రం 'వకీల్‌సాబ్' తుది దశ చిత్రీకరణకు చేరుకుంది. కానీ, ఆ మిగిలిన చిత్రీకరణను పూర్తి చెయ్యడానికి మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవలే పవన్ తన చిత్ర షూటింగ్‌లపై మాట్లాడుతూ.. "కరోనా పరిస్థితులు కుదుటపడే వరకు చిత్రీకరణలకు వెళ్లకపోవడమే మేల"ని చెప్పుకొచ్చారు. ఒకవేళ 'వకీల్‌సాబ్' చిత్రాన్ని ఈ ఏడాది ఆఖరు నాటికి తిరిగి సెట్స్‌పైకి తీసుకెళ్లినా.. ఆయన్ని తెరపై కనిపించడానికి వచ్చే ఏడాది సంక్రాంతి వరకైనా వేచి చూడక తప్పదు. ఇక ఈ సినిమా పూర్తయ్యాకే క్రిష్, హరీష్ శంకర్ దర్శకత్వాల్లో చెయ్యాల్సిన చిత్రాల్ని ఒక దాని వెంట మరొకటి సెట్స్‌పైకి తీసుకెళ్లాలని ఆలోచన చేస్తున్నారు పవన్.
ఈ ఏడాదికీ రానా రాక లేనట్లే
2017లో వచ్చిన 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రం తర్వాత కథానాయకుడు రానా నుంచి నేరుగా మరే చిత్రమూ రాలేదు. 'ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు' చిత్రాల్లో మెరిసినా.. అవి అతిథి పాత్రల్లాంటివే. అవి కూడా గతేడాది సంక్రాంతి సీజన్‌లోనే వచ్చాయి. 'హౌస్‌ఫుల్ 4'లోనూ ఇదే తరహాలో ఓ కీలక పాత్రలో మెప్పించినప్పటికీ.. అది బాలీవుడ్‌కే పరిమితమైన చిత్రంగా మిగిలిపోయింది. అంటే దాదాపు మూడేళ్లుగా రానా నుంచి నేరుగా మరే చిత్రమూ రాలేదన్న మాట. నిజానికి అన్నీ అనుకున్నట్లు జరిగుంటే.. ఈ ఏడాది వేసవిలోనే 'అరణ్య', 'విరాటపర్వం' చిత్రాలతో రానాను తెరపై చూసుకునే వీలు దక్కేది. కానీ, కరోనా కారణంగా ఆయన కోసం అభిమానులు మరింత కాలం నిరీక్షించాల్సి వస్తోంది. ఇప్పటికే 'అరణ్య' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. అదెప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుందన్నదీ థియేటర్లు తెరవడంపై ఆధారపడి ఉంది. లేదంటే ఓటీటీ వైపు చూసే అవకాశాలున్నాయి. ఇక వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'విరాటపర్వం' చిత్రం తుది దశ చిత్రీకరణలో ఉంది. ఇది పూర్తయ్యి ప్రేక్షకుల ముందుకు రావడానికి వచ్చే ఏడాది వరకైనా వేచి చూడక తప్పదు.
అల్లూరి.. భీమ్ కనిపించేది అప్పుడే..
దర్శకధీరుడు రాజమౌళి చిత్రాలెప్పుడూ.. భారీ యాక్షన్ హంగులు, ఆశ్చర్యపరిచే గ్రాఫిక్స్ సొబగులకు చిరునామాలుగా నిలుస్తుంటాయి. ఇన్ని హంగులతో తన చిత్రాల్ని ఓపిగ్గా ముస్తాబు చేస్తుంటారు కాబట్టే.. రాజమౌళి సినిమాలు పూర్తవడానికి రెండు, మూడేళ్ల సమయం పడుతుంటుంది. అందుకే ఆయనతో పనిచేసే అవకాశమొచ్చే ఏ కథానాయకుడైనా తన సినీ క్యాలెండర్‌లో కనీసం రెండేళ్ల కాలాన్నైనా ఖాళీగా ఉంచుకోవాల్సి వస్తుంటుంది. ఇప్పుడు 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రం కోసం రంగంలోకి దిగిన అగ్ర హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల విషయంలో ఇదే జరుగుతోంది. ఎన్టీఆర్ చివరిగా 2018లో దసరాకు 'అరవింద సమేత..' చిత్రంతో పలకరించగా.. చరణ్ 2019 సంక్రాంతికి 'వినయ విధేయ రామ' చిత్రంతో తెరపై దర్శనమిచ్చారు. ఇక ఆ తర్వాత నుంచి ఇద్దరూ రాజమౌళి మల్టీస్టారర్ చిత్రంతోనే బిజీ అయిపోయారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ముగ్గుల పండక్కి తీసుకు రానున్నట్లు జక్కన్న ప్రకటించారు. కానీ, కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈచిత్రం ఆలస్యమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటికే 70 శాతానికిపైగా చిత్రీకరణ పూర్తికాగా.. మిగిలిన షూట్ పూర్తి కావడానికి మరో రెండు మూడు నెలలైనా సమయం పట్టే అవకాశాలున్నాయి. దీనికి తోడు గ్రాఫిక్స్ పనులకు ఎక్కువ సమయమే పడుతుంది. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకోని చూస్తే చరణ్, తారక్‌లను వచ్చే వేసవికి దర్శించుకునే అవకాశం అభిమానులకు కలుగుతుందేమో. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌ల జీవితాల స్ఫూర్తితో అల్లుకున్న ఫిక్షనల్ కథాంశంతో రాజమౌళి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో అల్లూరిగా చరణ్.. భీమ్ పాత్రను తారక్ చేస్తున్నారు.