కరోనా వైరస్ ఉద్ధృతి దృష్ట్యా ఉపాధికి దూరమైన సినీ కార్మికులను ఆదుకునేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ కదిలివచ్చింది. మెగాస్టార్ చిరంజీవి అధ్యక్షతన 'కరోనా క్రైసిస్ ఛారిటీ మనకోసం' పేరుతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. నటీనటులు, దర్శక నిర్మాతలు ఇచ్చే విరాళాలను ఈ కమిటీ ద్వారా కార్మికుల సంక్షేమం కోసం వినియోగించనున్నట్లు కమిటీ సభ్యులు ఎన్.శంకర్ తెలిపారు.
కమిటీ సభ్యులుగా ప్రముఖ నిర్మాత సురేష్ బాబుతోపాటు ఫిల్మ్ చాంబర్ కార్యదర్శి దామోదరప్రసాద్, మా అధ్యక్షుడు బెనర్జీ, దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్, మెహర్ రమేష్ తోపాటు గీతా ఆర్ట్స్ బాబు, కోటగిరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ, కొమరం వెంకటేష్ అన్ని కార్మిక సంఘాల నాయకులు ఈ కమిటీలో భాగస్వాములుకానున్నారు.
ఇప్పటికే కార్మికుల సంక్షేమం కోసం చిరంజీవి కోటి రూపాయలు ప్రకటించగా అక్కినేని నాగార్జున కోటి రూపాయలు, దగ్గుబాటి సురేష్ బాబు, రానా, వెంకటేశ్ సంయుక్తంగా కోటి రూపాయలు, జూనియర్ ఎన్టీఆర్ 25 లక్షలు, మహేశ్ బాబు 25 లక్షలు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.