సినిమాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రూ.వందల కోట్ల పెట్టుబడులు స్తంభించిపోయాయి. వేల మంది ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. వరుసగా రెండేళ్లు ఎదురు దెబ్బ తగలడం వల్ల చిత్రసీమ కోలుకోలేని స్థితిలోకి వెళ్లింది. అందుకే వీలైనంత తొందరగా కరోనా నుంచి బయట పడాలని చూస్తోంది సినీ పరిశ్రమ.
కథానాయకులు, నిర్మాతలు మొదలుకొని దర్శకుల వరకు ఎవరికివారు వ్యక్తిగతంగా చొరవ తీసుకుంటున్నారు. తమ సిబ్బంది కరోనాని ఎదుర్కొనేందుకు తగిన జాగ్రత్తల్ని సూచించడం మొదలుకొని వారు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య స్థితిగతుల్ని పర్యవేక్షించడం వరకు వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుంటున్నారు. వ్యాక్సినేషన్ విషయంలోనూ స్వయంగా ముందుకొచ్చి ఏర్పాట్లు చేయిస్తున్నారు.
అల్లు అర్జున్ తన కుటుంబంతోపాటు వ్యక్తిగత సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు మొదలుకొని మొత్తం 135 మందికి వ్యాక్సిన్ ఇప్పించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఆయనే దగ్గరుండి చూసుకున్నారు.
అగ్ర కథానాయకుడు చిరంజీవి కరోనా రెండో ఉద్ధృతి మొదలుకాగానే సీసీసీ, అపోలో సమన్వయంతో పరిశ్రమలోని పలువురు కార్మికులకి వ్యాక్సిన్ అందేలా ఏర్పాట్లు చేశారు. దర్శకుడు సుకుమార్ తన బృందానికి, వారి కుటుంబ సభ్యులకి వ్యాక్సిన్ ఇప్పించినట్టు తెలిసింది. ప్రముఖ నిర్మాణ సంస్థలన్నీ సిబ్బందిని వ్యాక్సినేషన్‌ని పూర్తి చేసుకునే దిశగా ప్రోత్సహిస్తున్నాయి. సినీ కార్మిక సమాఖ్య ఆధ్వర్యంలోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియకి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.