27 ఏళ్ల తర్వాత ‘మా’కు సొంత భవనం ఏర్పాటు కానుందని ప్రముఖ నటుడు బండ్ల గణేష్(Bandla Ganesh) అన్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ 'మా' ఎన్నికల్లో(MAA Elections) ప్రకాశ్‌రాజ్ నేతృత్వంలోని సిని'మా' బిడ్డల ప్యానెల్లో బండ్ల గణేష్ ఓ సభ్యుడిగా ఉన్నారు. మరికొన్ని నెలల్లో జరగనున్న ‘మా’ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం ఉదయం ప్రకాశ్‌రాజ్ తన ప్యానల్ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. లోకల్, నాన్‌లోకల్ అంటూ వస్తున్న కామెంట్లపై స్పందించారు. అనంతరం బండ్ల గణేష్ మాట్లాడారు.
"ప్రకాశ్‌రాజ్ నాకు 23 ఏళ్ల నుంచి తెలుసు. ఆయనంటే నాకెంతో ఇష్టం. ఆయనొక అద్భుతమైన వ్యక్తి. ఆయనతో అనుబంధం ఉన్నవాళ్లకే ఆ విషయం తెలుస్తుంది. కొన్నేళ్ల క్రితం షాద్‌నగర్‌లో వ్యవసాయం చేయడానికి భూమి కావాలంటూ ఆయన నన్ను సంప్రదించారు. నేనే ఆయనకు 10 ఎకరాల వ్యవసాయ భూమి ఇచ్చాను. తన సేవాభావంతో ఇప్పుడు ఆయన మా షాద్‌నగర్‌కే గుర్తింపు తెచ్చిపెట్టారు. షాద్‌నగర్‌కు సమీపంలో ఉన్న కొండారెడ్డిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఆ గ్రామంలో అవసరమైన వసతులు ఏర్పాటు చేస్తున్నారు. కరోనా సమయంలో ఎంతోమంది వలస కార్మికులకు తన ఫామ్‌హౌస్‌లో మూడు నెలలు ఆశ్రయం కల్పించి.. అన్నిరకాల వసతులు ఏర్పాటు చేసి.. బస్సుల ద్వారా వాళ్లని స్వగ్రామాలకు పంపించారు. ఆయనలో ఉన్న గొప్ప వ్యక్తిత్వానికి అది కూడా ఒక నిదర్శనం. ప్రకాశ్‌రాజ్ లోకల్, నాన్‌లోకల్ కాదు. ఇది 'మా'. మాకు కులాలు లేవు. వర్గాలు లేవు. మేమంతా మా మనుషులం. మాదంతా ఒకటే కుటుంబం. 27 ఏళ్ల క్రితం చిరంజీవి అధ్యక్షుడిగా 'మా'ను స్థాపించారు. అప్పటి నుంచి ప్రతి అధ్యక్షుడు కష్టపడి పనిచేశారు. గతంలో అధ్యక్షులు చేసిన పనుల్ని మేము వేలెత్తి చూపించం. ప్రకాశ్‌రాజ్ చేయాలనుకున్న ప్రతి పనిని 100శాతం పూర్తి చేస్తారని భావిస్తున్నా. అందుకే ఆయన టీమ్‌లో చేరా. షాద్‌నగర్‌లో ఆయన ఎన్నో అద్భుతాలు చేశారు. 27 సంవత్సరాల తర్వాత 'మా'కంటూ ఓ సొంతం భవనం రాబోతుంది" అని బండ్లగణేష్ వివరించారు.