కవులంతమందీ అన్ని రకాల పాటలూ రాయలేరు. కొన్ని పాటలు మాత్రమే రాయడంలో లబ్ధప్రతిష్టులవుతారు. ప్రముఖ సినీ కవి శ్రీ వేటూరిలాంటి వారు మాత్రమే.. తమ కలంతో ఎలాంటి సన్నివేశాన్ని అయినా సునాయాసంగా రక్తి కట్టించగలరు. అక్షర సరస్వతి పారాణి పాదాలని పాటల సిరిసిరి మువ్వలతో అలంకరించగలరు. ఔను.. ఆయన అలనాటి శ్రీనాధుడికి అచ్చమైన, స్వచ్ఛమైన వారసుడు. ఈ యుగం నాదే అని సగర్వంగా ప్రకటించిన మనతరం మహాకవి శ్రీశ్రీని సందర్భానుసారం ఆవహించుకోగల సర్వ సమర్థుడు. ఆయనే.. వేటూరి సుందర రామ్మూర్తి.
ఈరోజు వేటూరి వర్ధంతి సందర్భంగా ప్రముఖ గాయకుడు బాల సుబ్రహ్మణ్యం ప్రత్యేకంగా ఆయనను స్మరించుకున్నారు. "ఏమయ్యా.. ఎవరినడిగి వచ్చావ్ మా ఎదల్లోకి. నిన్ను మేము రమ్మనలేదే. అయినా వచ్చేశావ్. హరికథ చెప్తా అన్నావ్. సరేలే హరికథే కథా అని వదిలేశాం. నువ్ మమ్మల్ని వదల్లేదే" అంటూ ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.
అవిశ్రాంతంగా చివరి క్షణం వరకూ గీత రచనలో తరించిన వేటూరి 2010 మే 22న తనువు చాలించారు. ఆయన లేకున్నా... ఆయన రాసిన వేలాది పాటలు ఇప్పటికీ సాహితీ బంధువులను అలరిస్తూనే ఉన్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">