"నాకు హిట్ ఫ్లాప్‌లు వద్దు. కాలర్ ఎగరేసుకుని, నందమూరి అభిమాని అయినా ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద తిరగాలనేదే నా కోరిక" అని 'టెంపర్' సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో హీరో ఎన్టీఆర్ చాలా భావోద్వేగంతో చెప్పారు. అన్నిసార్లు తమ సినిమాల గురించి హీరోలు ఇలానే చెప్తారులే, ఏముంది అని చాలామంది భావించారు. చిత్ర విడుదల తర్వాత గానీ అసలు విషయం తెలియలేదు.
తారక్ అసలు అప్పుడు ఎందుకు అలా చెప్పారో అందరికీ అర్ధమైంది. అప్పుడు మొదలైన ఎన్టీఆర్ సరికొత్త ప్రభంజనం.. ఇప్పటికీ సినిమా సినిమాకు రెట్టింపు అవుతూ వస్తోంది. ఎన్టీఆర్ మా హీరో అని అభిమానులు గర్వపడేలా, అప్రతిహతంగా సాగుతోంది.
'టెంపర్' తర్వాత మొదలైన మార్పు?
'నిన్ను చూడాలని' చిత్రంతో తొలిసారి హీరోగా చేసిన ఎన్టీఆర్.. కెరీర్ ప్రారంభంలో స్టూడెంట్ నం.1, ఆది, సింహాద్రి లాంటి సూపర్హిట్లు అందుకున్నారు. ఆ తర్వాత యమదొంగ, అదుర్స్ సినిమాలతో ప్రేక్షకుల మనసు గెల్చుకున్నారు. అప్పటివరకు హిట్లు తక్కువ, అపజయాలు కాస్త ఎక్కువగా కొనసాగుతున్న తారక్ కెరీర్‌కు 'టెంపర్' ఓ టర్నింగ్ పాయింట్ అయింది.
ఆ చిత్రంతో మొదలైన ఎన్టీఆర్ సరికొత్త ప్రస్థానం.. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత లాంటి సినిమాలతో వరుసగా దూసుకుపోతోంది. అటు ప్రేక్షకులు కాలర్ ఎగరేసేలా చేస్తూ, విమర్శకుల నోటికి తాళం వేస్తూ తారక్ తనదైన మార్క్ చూపించారు.
'ఆర్ఆర్ఆర్'తో పాన్ ఇండియా స్టార్‌గా
ఇప్పటివరకు టాలీవుడ్‌కు మాతమ్రే పరిమితమైన ఎన్టీఆర్.. ఎస్.ఎస్.రాజమౌళి తీస్తున్న 'ఆర్ఆర్ఆర్'తో పాన్ ఇండియా స్థాయిలో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ పోరాటయోధుడు కొమురం భీమ్‌గా ఇందులో కనిపించనున్నారు. 2018 నుంచి ఇప్పటివరకు ఈ సినిమా కోసమే తన డేట్లు కేటాయించారు. ఓ సినిమా గురించి ఇన్నేళ్ల పాటు తారక్ పనిచేయడం ఇదే తొలిసారి.
తొలిసారి ఓ అగ్రహీరోతో కలిసి
తన 20 ఏళ్ల కెరీర్లో ఇప్పటివరకు సోలోగానే మెప్పించిన ఎన్టీఆర్.. 'ఆర్ఆర్ఆర్' కోసం తొలిసారి, తనలాంటి స్టార్ హీరోతో తెర పంచుకునేందుకు సిద్ధమయ్యారు. మెగాహీరో రామ్‌చరణ్‌తో కలిసి ఇందులో నటిస్తున్నారు. మరి ఈ కాంబో టాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలంటే మరికొద్ది కాలం ఎదురుచూడాల్సిందే.