మాధవన్... ఒకప్పుడు యువ తరానికి ప్రతినిధిగా తెరపై కనిపించారు. వయసు పెరుగుతున్నకొద్దీ క్రమంగా అందుకు తగ్గ కథల్ని, పాత్రల్ని ఎంచుకుంటూ ప్రయాణం సాగిస్తున్నారు. 'సవ్యసాచి' తర్వాత ఆయన నేరుగా తెలుగులో చేసిన మరో చిత్రం 'నిశ్శబ్దం'. అనుష్క, అంజలి ప్రధాన పాత్రలు పోషించారు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్ నిర్మించారు. అక్టోబరు 2న అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా 'నిశ్శబ్దం' చిత్రానికి సంబంధించిన విశేషాలను మాధవన్ పంచుకున్నారు.
మీ కెరీర్‌లో థ్రిల్లర్ సినిమాలు ఎక్కువగానే కనిపిస్తాయి. స్వతహాగా మీకు ఎలాంటి కథలంటే ఇష్టం?
రొమాన్స్, కామెడీతో కూడిన కథలంటేనే ఇష్టం. ఆ తర్వాత యాక్షన్ ఇష్టపడతా. థ్రిల్లర్ చిత్రాలు చూస్తాను కానీ, హారర్ కథలకి దూరంగా ఉంటా. 'నిశ్శబ్దం' పక్కా థ్రిల్లర్ సినిమా.
'నిశ్శబ్దం' కథ విన్నాక మీ మనసులో ఎలాంటి ఆలోచనలు మెదిలాయి?
రచయిత కోన వెంకట్, దర్శకుడు హేమంత్ మధుకర్ వచ్చి ఈ కథ చెప్పారు. మాట్లాడలేని, వినలేని ఓ అమ్మాయి కథ ఇది. అలాంటి అమ్మాయి ఓ హత్య కేసును ఎలా పరిష్కరించిందనే అంశం నన్నెక్కువగా ఆకట్టుకుంది. మొదట దీన్ని మాటల్లేకుండా సాగే సినిమాగా చేయాలనుకున్నాం. ఆ విషయం నన్ను మరింత ఆత్రుతకు గురిచేసింది. అయితే సినిమా చేస్తున్నప్పుడు మాటల్లేకుండా ఈ కథని నడిపించలేం అనిపించింది. అప్పుడు కొన్ని సంభాషణల్ని జోడించాం.
ఇందులో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?
ఇలాంటి పాత్రను ఇదివరకెప్పుడూ చేయలేదు. అంతర్జాతీయ సెల్లో ప్లేయర్‌గా కనిపిస్తా. ప్రపంచ స్థాయి సెల్లో ప్లేయర్ పాత్ర కాబట్టి, ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవల్సి వచ్చింది.
మీ కెరీర్‌లో నేరుగా ఓటీటీలో విడుదలవుతున్న సినిమా ఇదే కదా?
ఇదివరకు అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం 'బ్రీత్' అనే వెబ్ సిరీస్ చేశా. సినిమా మాత్రం ఇదే తొలిసారి. థియేటర్‌లో కాకుండా, ఓటీటీలో విడుదలవుతోందా? అని మొదట్లో కొంచెం బాధపడ్డా. ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. కొవిడ్ కాలంలో ప్రేక్షకులకు ఓ మంచి సినిమా అందుబాటులోకి వస్తోంది. ఓటీటీ ద్వారా ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువవుతుంది.
పలు భాషలకు చెందిన నటులతో, భిన్న భాషల్లో రూపొందిన సినిమా ఇది. ఈ ప్రయాణం ప్రత్యేకంగా అనిపించిందా?
సినిమాకు హద్దులు చెరిగిపోయాయి. భిన్న భాషలకు చెందిన నటులు, సాంకేతిక నిపుణులు కలిసినప్పుడు మరిన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. ఈ సినిమా ప్రయాణంలో సవాళ్లున్నాయి, అంతే సరదాగానూ సాగింది. భాష పరంగానూ నాకు ఎలాంటి సమస్యా ఎదురు కాలేదు.
అనుష్కతో 14 ఏళ్ల తర్వాత చేస్తున్నారు కదా?
అనుష్క, నేను హీరోహీరోయిన్లుగా 'రెండు' అనే సినిమాలో నటించాం 14 ఏళ్ల తర్వాత మేం మళ్లీ 'నిశ్శబ్దం' కోసం కలిసి పనిచేశాం. నటిగా ఆమె పరిణతి చెందిన విధానం, ఆమె సినిమాను అర్థం చేసుకునే విధానం ముచ్చటగా అనిపించింది. సినిమా, సన్నివేశాల విషయంలోనూ ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తుంటుంది. అదే సమయంలో చుట్టూ ఉన్నవాళ్ల గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. అనుష్కలో ఆ గుణం నాకు బాగా నచ్చుతుంది.
'సవ్యసాచి' తర్వాత తెలుగు నుంచి మరిన్ని కథలు మీ దగ్గరికొస్తున్నట్టున్నాయి కదా?
తెలుగు దర్శకులు నాపై చాలా దయతో ఉన్నారు. వాళ్లు తయారు చేస్తున్న కథలు చాలా బాగున్నాయి. 'సవ్యసాచి' తర్వాత తెలుగు నుంచి చాలా కథలొచ్చాయి. వాటిలో పెద్ద సినిమాలే ఎక్కువ. కానీ 'రాకెట్రీ' వల్ల ఏదీ ఒప్పుకోలేకపోయా. నేను స్వయంగా దర్శకత్వం వహిస్తూ నిర్మించిన సినిమా అది.
'సఖి', 'చెలి' తదితర సినిమాలు తెలుగులో ఎంతో ఆదరణ పొందాయి. అభిమానుల్ని కూడా సంపాదించారు. అప్పట్లో నేరుగా తెలుగు సినిమాలు ఎందుకు చేయలేదు?
భాష తెలియకపోవడమే కారణం. సినిమాకు డైలాగ్ డెలివరీ ప్రాణం. నాకు తెలుగు తెలియదు. మార్కెట్ ఉంది కదా అని, భాష తెలియకుండా చేసి ప్రేక్షకుల్ని మోసం చేయకూడదు కదా. అందుకే తమిళం, హిందీ భాషల్లోనే చేశా. 'సవ్యసాచి'కి నేనే సొంతంగా డబ్బింగ్ చెప్పాలనుకున్నా. కానీ 'రాకెట్రీ' వల్ల చెప్పలేకపోయా. నా తదుపరి తెలుగు సినిమాకు మాత్రం తప్పకుండా నేనే డబ్బింగ్ చెప్పుకొంటా. దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు ఉంది. ఆ విషయంలో నేను అదృష్టవంతుడిని. ఇకపై ఎన్ని భాషల్లో చేయగలిగితే అన్ని భాషల్లో సినిమాలు చేస్తా. 'రాకెట్రీ' హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కాబోతోంది.