కరోనా మహమ్మారి నియంత్రణకు తమ వంతు కృషి చేస్తున్నారు సినీ తారలు. కొందరు కోట్ల రూపాయలు విరాళాలు ఇచ్చి పెద్ద మనసు చాటుకుంటే, మరికొందరు తమదైన శైలిలో ప్రజలను అప్రమత్తం చేసేలా ప్రచారాలు చేస్తున్నారు. ప్రముఖ మల్లూవుడ్ నటుడు ఇంద్రన్స్ ఇంకో అడుగు ముందుకేసి.. ఇంట్లోనే మాస్కులు తయారు చేసుకోవడం ఎలానో వివరించారు. స్వయంగా తానే కుట్టి మరీ చూపించారు.
జైల్లో జై మాస్క్..
కేరళ ప్రభుత్వం చేపట్టిన కరోనా వ్యతిరేక ఉద్యమం 'బ్రేక్ ద చైన్'లో భాగస్వాములయ్యారు ఇంద్రన్స్. పూజప్పురలోని సెంట్రల్ జైల్లో మాస్క్‌లు కుట్టి, వీడియో తీసి ప్రచారం చేస్తున్నారు. ఈ వీడియోను కేరళ మెగాస్టార్ మమ్ముట్టి కూడా సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.
రాష్ట్రంలో మాస్కుల కొరత తీవ్రంగా ఉంది కాబట్టి తమవంతుగా 5 లక్షల మాస్కులు తయారు చేసి ప్రభుత్వానికి ఇస్తామని కేరళ పోలీసు శాఖ మాటిచ్చింది. అందుకు తగ్గట్టుగానే జైళ్లలో ఉండే ఖైదీలతో మాస్కులు కుట్టిస్తూ వారిని కరోనాతో పోరులో భాగస్వాములను చేస్తోంది. పోలీసుల ఆశయానికి ఇంద్రన్స్ ఇలా మద్దతు పలికారన్నమాట.
మూలాలు అక్కడే..
నాలుగు దశాబ్దాలుగా 500కు పైగా చిత్రాల్లో నటించిన ఇంద్రన్స్ వెండితెరపై కనిపిస్తే చాలు థియేటర్లలో నవ్వులే నవ్వులు. హాస్యనటుడిగానే కాదు 2018 ఆలోరుక్కమ్ చిత్రంతో ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. అంతే కాదు, అంతర్జాతీయ స్థాయిలోనూ గౌరవాలు దక్కించుకున్నారు. అయితే, నటనలో కాలు మోపక ముందు కాస్ట్యూమ్ డిజైనర్‌గా మొదలైంది ఇంద్రన్స్ ప్రస్థానం. అందుకే, మళ్లీ టైలర్‌గా అవతారమెత్తి కరోనాకు అడ్డుకుట్ట వేసే మాస్కులు సులభంగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో నేర్పించేశారు.
"ఇది నాకు తెలిసిన విద్య కాబట్టి.. ఈ వీడియో కోసం నేను నటించాల్సిన పని లేదు. వైరస్ వేగంగా వ్యాపిస్తోంది.. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి."
- ఇంద్రన్స్, నటుడు